- ఉదయం తాడువ గ్రామంలో కూటమి కార్యకర్తల ఎన్నికల ప్రచారం
- కూటమి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి
- తాడువ గ్రామానికి వచ్చిన సీఎం రమేశ్ ను తరలించేందుకు పోలీసుల యత్నం
- పోలీసుల సమక్షంలోనే సీఎం రమేశ్ పై దాడి
- సీఎం రమేశ్ చొక్కా చించేసిన వైనం
అనకాపల్లి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. సీఎం రమేశ్ ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం మాడుగుల మండలం తాడువ చేరుకోగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఈ ఉదయం కూటమి తరఫున కొందరు తాడువ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. వారిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, వారి పరికరాలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, తాడువ గ్రామానికి వచ్చిన సీఎం రమేశ్ ను బూడి ముత్యాలనాయుడు నివాసం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను తాడువ నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. సీఎం రమేశ్ ను పోలీసులు తరలిస్తున్న వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే సీఎం రమేశ్ పై దాడికి దిగారు. సీఎం రమేశ్ చొక్కా చించేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో సీఎం రమేశ్ కు చెందిన మూడు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కాగా, సీఎం రమేశ్ ను పోలీసులు దేవరపల్లికి తరలించారు.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇదే స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉన్నారు.
బూడి ముత్యాలనాయుడు ఇవాళ తన స్వగ్రామం తాడువలో ఉండగా, ఆయన నివాసం వద్ద డ్రోన్ల కలకలం చెలరేగింది. ఈ డ్రోన్లు ఎగరవేసిన వ్యక్తులను పట్టుకున్న వైసీపీ కార్యకర్తలు వారిని పోలీసులకు అప్పగించారు. కాగా, తనను హత్య చేసేందుకు ఇలా డ్రోన్లతో రెక్కీ చేశారని బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు.