- గంటకు 160 కి.మీ. వేగంతో పెను గాలులు
- విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు.. అంధకారంలో ఇళ్లు
- మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
అమెరికాలోని హ్యూస్టన్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది.. గంటకు 160 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరంలోని పలు ఏరియాలలో అంధకారం నెలకొంది. భారీ వర్షాలకు సిటీతో పాటు టెక్సస్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం ఏడుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. చెట్లు విరిగిపడడం, పలు చోట్ల గోడలు కూలిన ఘటనలలో పలువురికి గాయాలయ్యాయని వివరించారు. పెనుగాలుల కారణంగా సిటీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా వీధులు నదులను తలపిస్తున్నాయి.
హ్యూస్టన్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా హ్యూస్టన్ లోని స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించింది. ఈమేరకు సిటీ మేయర్ జాన్ విట్‌మైర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈదురుగాలులతో కూడిన వర్షానికి సిటీలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని చెప్పారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సుడిగాలులు వీచే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని సిటీ వాసులకు విజ్ఞప్తి చేశారు.