Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్…!

  • కేంద్రం సుప్రీంకోర్టు కోసం కొత్త భవనం కడుతోందన్న కేకే రమేశ్ అనే వ్యక్తి
  • 27 కోర్టు రూములు, 4 రిజిస్ట్రార్ రూములతో ఈ భవనం నిర్మిస్తున్నారని వివరణ
  • సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చకుండా, ఇతర పనుల కోసం ఉపయోగించుకోవాలని సూచన
  • ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోసం కొత్త భవన సముదాయం నిర్మించేందుకు, ఇప్పుడున్న సుప్రీంకోర్టు భవనాలను కూల్చివేయవద్దంటూ కేకే రమేశ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉన్న సముదాయంలో 17 కోర్టు రూములు, రెండు రిజిస్ట్రార్ కోర్టు రూములు ఉన్నాయని, వాటి స్థానంలో రూ.800 కోట్లతో కేంద్రం కొత్త భవనాలు నిర్మించేందుకు సిద్ధమైందని పిటిషనర్ ఆరోపించారు. కొత్త భవనాల్లో 27 కోర్టు రూములు, నాలుగు రిజిస్ట్రార్ కోర్టు రూములు నిర్మించనున్నారని వివరించారు. 

దేశంలోని స్మారక నిర్మాణాల్లో సుప్రీంకోర్టు కూడా ఒకటని, కొత్త భవన సముదాయం కోసం ఈ నిర్మాణాన్ని కూల్చివేయడం తగదని కేకే రమేశ్ పేర్కొన్నారు. దీన్ని కూల్చివేయడం కంటే మరో విధంగా ఉపయోగించుకోవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. 

ఒకవేళ సుప్రీంకోర్టు కొత్త భవన సముదాయంలో 27 కోర్టు రూములు, 4 రిజిస్ట్రార్ కోర్టు రూములు నిర్మించినప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా అవి సరిపోవని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని, సమాజ స్థితిగతులు మారిపోతున్నాయని, ఈ కోర్టు రూములు కూడా చాలని పరిస్థితి ఎదురవుతుందని వివరించారు. మరో పదేళ్లలో సుప్రీంకోర్టులో కేసులు కూడా వేగంగా పెరిగిపోతాయని తన పిటిషన్ లో ప్రస్తావించారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నూతన భవన సముదాయానికి సంబంధించిన డిజైన్ ను ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదని, దీనిపై సాధారణ ప్రజలతోనూ, బార్ అసోసియేషన్లతోనూ చర్చించలేదని పిటిషనర్ కేకే రమేశ్ ఆరోపించారు.

Related posts

వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు!

Ram Narayana

మీడియా ప్రతినిధులపై కర్ణాటక సీఎం అసహనం!

Ram Narayana

గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన కేంద్రం.. వారికైతే ఏకంగా రూ. 400 తగ్గింపు!

Ram Narayana

Leave a Comment