Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం.. నరసరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి…

  • పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • వీడియో వెలుగులోకి రావడంతో అరెస్ట్‌‌కు ఈసీ ఆదేశం
  • అప్పటికే పరారైన వైసీపీ ఎమ్మెల్యే
  • ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ అరెస్టు నుంచి ఉపశమనం
  • కోర్టు షరతు ప్రకారం గత రాత్రి 12 గంటలకు ఎస్పీ ఎదుట హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. మూడు కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.

ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు. 

ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, తనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.

Related posts

వినీలాకాశంలో… రుధిర చంద్రుడు….

Drukpadam

కొడుకు మృతి …కోడలికి రెండవ పెళ్లి …!

Drukpadam

ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ సంఘాల నేతలు!

Drukpadam

Leave a Comment