Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఎల్లుండి లొంగిపోతున్నా… ఈసారి జైల్లో మరింత వేధింపులకు గురిచేయవచ్చు: అరవింద్ కేజ్రీవాల్

  • నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడేందుకు జైలుకు వెళుతున్నానన్న కేజ్రీవాల్
  • జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా అడ్డుపడ్డారని ఆరోపణ
  • జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ప్రజల గురించే ఆలోచిస్తానన్న కేజ్రీవాల్

జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచేది లేదని… ఈసారి జైలుకు వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఆయన రెండో తేదీన కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… తాను ఎల్లుండి లొంగిపోనున్నట్లు చెప్పారు. జూన్ 2న తాను లొంగిపోయిన తర్వాత ఈసారి మరెంతకాలం జైల్లో ఉంటానో తెలియదన్నారు.

నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు తాను జైలుకు వెళుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా అడ్డుపడ్డారని… దీంతో అరెస్టైనప్పుడు 70 కిలోలు ఉన్న తాను… ఆరు కిలోలు తగ్గినట్లు చెప్పారు. కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తనకు సూచించారని… అంతర్గతంగా ఉన్న తన ఆరోగ్య పరిస్థితికి ఇది సంకేతం కావొచ్చునని వ్యాఖ్యానించారు.

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పోలీసుల ఎదుట లొంగిపోతానని కేజ్రీవాల్ తెలిపారు. ఈసారి తనను ఇంకా వేధింపులకు గురి చేయవచ్చునన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ప్రజల గురించే ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు. మీకోసం ఓ కొడుకులా పని చేశానన్నారు. ప్రజలను తాను అభ్యర్థించేది ఒక్కటేనని… అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

Related posts

ఏఐసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి …

Ram Narayana

జర్నలిస్టులకు ,సీనియర్ సిటిజన్స్ కు రైల్వే ప్రయాణంపై రాయితీ ఇక లేనట్లే …!

Ram Narayana

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

Ram Narayana

Leave a Comment