పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన పొంగులేటి
స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి
రూ. 22 కోట్లతో పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తానని వెల్లడి
అధికారం పోయిన అహంకారం వీడని బీఆర్ యస్ అంటూ చురకలు
పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా …నాపై విశ్వాసంతో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు …నన్ను ఈస్థాయిలో నిలబెట్టడానికి మీరే కారణం మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా …మీకు ఏకష్టం వచ్చిన తోడుగా మీ శీనన్న ఉంటాడు …అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ..సోమవారం నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు …వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు …
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కొత్తకొత్తూరు , మంగాపురం తండా, రాయగూడెం, అప్పలనరసింహాపురం, కొంగర, కట్టుకాచారం, బుద్దారం, చెరువుమదారం, రాజారాంపేట, అజయ్ తండా, భైరవునిపల్లి, తిరుమలపురం, పైనంపల్లి, రామచంద్రాపురం, సుర్దేపల్లి, పాత కొత్తూరు, చెన్నారం గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. స్థానికులను అడిగి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం న్యాయమైన కోరికలు అన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఆ తర్వాత అక్కడే స్థానికులతో మంత్రి సమావేశం అయ్యారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు.
ముఖ్యంగా పాలేరులోని అన్ని గ్రామాల్లో ఏడాదిలోగా సీసీరోడ్లు పూర్తి చేస్తానని చెప్పారు. అలాగే రూ. 22.5 కోట్లు ఖర్చుపెట్టి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరడంతో రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయినా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకారం వీడట్లేదని దుయ్యబట్టారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.