- ఈ ఎదురుదెబ్బ చాలా నిరాశకు గురిచేస్తోందన్న మాజీ మంత్రి
- ఓటమి ఎదురైనా కష్టపడుతూనే ఉంటామని ప్రకటన
- 24 ఏళ్ల సుధీర్ఘ కాలంలో అన్నీ చూశామని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా విఫలమైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలిచే పరిస్థితి అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో ఎంఐఎం ముందంజలో ఉంది. బీఆర్ఎస్ ‘సున్నా’ సీట్లకు పరిమితమవ్వడం ఖాయమైంది. ఈ దారుణ పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. నేటి (మంగళవారం) ఎన్నికల ఫలితాల్లో తగిన ఎదురుదెబ్బ కచ్చితంగా చాలా నిరాశకు గురిచేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ఓటమి ఎదురైనప్పటికీ కష్టపడుతూనే ఉంటామని, ఫినిక్స్ పక్షి మాదిరిగా పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
టీఆర్‌ఎస్ స్థాపించి 24 ఏళ్లు అవుతోందని, ఈ సుధీర్ఘ కాలంలో అన్నీ చూశామని అన్నారు. అద్భుతమైన గెలుపులు, విజయాలు, అనేక ఎదురుదెబ్బలను పార్టీ చూసిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్టీ సాధించిన అతిపెద్ద విజయమంటూ ఆయన అభివర్ణించారు. ప్రాంతీయ పార్టీగా ఉండి వరుసగా రెండు సార్లు రాష్ట్ర ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయాలు సాధించామని పేర్కొన్నారు. 2014లో 119కి 63 సీట్లు, 2018లో 119కి 88 సీట్లు దక్కించుకున్నామని కేటీఆర్ ప్రస్తావించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించి ప్రస్తుతం 1/3వ వంతు స్థానాలతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.