కడప ఎంపీ స్థానంలో అవినాశ్ రెడ్డి విన్నర్… షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే…!
- రాజకీయ, కుటుంబ కారణాల రీత్యా అందరి దృష్టిని ఆకర్షించిన ‘కడప’
- కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి పోటీ
- టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ
- మరోసారి అవినాశ్ కే పట్టం కట్టిన కడప ప్రజలు
- మూడో స్థానంలో షర్మిల
ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో కడప లోక్ సభ స్థానం ఒకటి. సిట్టింగ్ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి… వివేకా హత్యారోపణలు ఎదుర్కోవడం, ఆయనపై షర్మిల, సునీతారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేయడం వంటి కారణాలతో కడప ఎంపీ స్థానంపై ఆసక్తి నెలకొంది.
కడప ఎంపీ స్థానానికి సంబంధించి ఇవాళ ఓటర్ల తీర్పు వెలువడింది. నేడు జరిగిన కౌంటింగ్ లో అవినాశ్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయన 62,695 ఓట్ల తేడాతో తన సమీప టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిపై విజయం సాధించారు.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఆమెకు 41,039 ఓట్లు వచ్చాయి. మరోసారి కడప ఎంపీగా నెగ్గిన అవినాశ్ రెడ్డికి 6,05,143 ఓట్లు రాగా… రెండోస్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 5,42,448 ఓట్లు లభించాయి.