- ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం
- తిరుగులేని విజయాలు సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ
- చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పురందేశ్వరి, శ్రీభరత్ లకు ఎన్టీఆర్ విషెస్
ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ వాటానే 135 స్థానాలు.
144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 9 చోట్ల ఓడిపోయింది. దాదాపు చాలామంది టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయాలు అందుకున్నారు. అదే సమయంలో 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది.
అటు, జనసేన, బీజేపీ కూడా దుమ్మురేపాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు… బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ చిరస్మరణీయ విజయాలపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
“ప్రియమైన చంద్రబాబు మామయ్యకి… ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు” అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు.
మరో ట్వీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.