- ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు
- పూర్తి స్థాయి క్యాబినెట్ తో పరిపాలన షురూ చేయాలని భావిస్తున్న చంద్రబాబు
- ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో క్యాబినెట్ ప్రకటించే అవకాశం
కేంద్రంలో ఎన్డీయే కొత్త క్యాబినెట్ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో, ఏపీ క్యాబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో మంత్రి వర్గం ఎంపిక కత్తిమీద సాములా మారింది.
కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు మంత్రి పదవుల కేటాయింపు ఆధారంగా… ఏపీలో రాష్ట్ర క్యాబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. రేపు ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. వారిరువురూ ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారయ్యే అవకాశాలున్నాయి.
ఈ నెల 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. టీడీఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు.
జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, పూర్తి స్థాయి క్యాబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో క్యాబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ క్యాబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దలు చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.