Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య!

  • ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామంలో ఘటన
  • వైసీపీ గెలుస్తుందంటూ వార్డు మెంబర్ భారీగా బెట్టింగ్ 
  • కౌంటింగ్ రోజునే ఇల్లు విడిచి వెళ్లిపోయిన వార్డు సభ్యుడు
  • పందెం కాసిన వారు ఆయన ఇంట్లోని ఏసీలు, ఇతర సామాన్లు తీసుకెళ్లిన వైనం
  • విషయం తెలిసి మనస్తాపంతో ఆత్మహత్య

ఏపీలో ఎన్నికల బెట్టింగ్ ‌కు ఓ వ్యక్తి బలైపోయాడు. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. 

దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లి.. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

Drukpadam

ఇస్లాంలో ఈ ఐదు విషయాలే ఆవశ్యకం.. అందులో హిజాబ్ లేదు: కేరళ గవర్నర్!

Drukpadam

ముద్రగడ, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలకు ఊరట: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత…

Drukpadam

Leave a Comment