- జూన్ 25 మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యర్థులను ప్రతిపాదించే ఛాన్స్
- పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ఎన్నిక
- వివరాలు ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియెట్
లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటివరకు ఎవరి పేరూ తెరపైకి రాలేదు. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. అంటే జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ గురువారం ప్రకటించింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు రాతపూర్వకంగా తెలియజేయవచ్చునని స్పష్టం చేసింది.
కాగా లోక్‌సభ సమావేశాల్లో మొదటి రెండు రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు. ఇక జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల నూతన మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మొదటి రెండు రోజులపాటు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం స్పీకర్‌ను ఎన్నుకుంటారని వివరించారు.
జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.