- అమెరికాలోని న్యూజెర్సీలో సంఘటన
- జలంధర్‌కు చెందిన జస్వీర్ కౌర్ అనే యువతిని కాల్చిచంపిన గౌరవ్ గిల్
- ఇదే కాల్పుల్లో ఆమె సోదరి గగన్‌దీప్ కౌర్‌కు గాయాలు
- పోలీసుల అదుపులోకి నిందితుడు
- ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత కాన్సులేట్
అమెరికాలోని న్యూజెర్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు చెందిన జస్వీర్ కౌర్ అనే యువతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇదే కాల్పుల్లో ఆమె సోదరి గగన్‌దీప్ కౌర్ గాయాలతో బయటపడింది. వారు నివాసం ఉండే కార్టెరెట్ పరిధిలోని రుజ్వెల్ట్ లోని ఇంటి ముందే కాల్పులు చోటు చేసుకున్నాయి.
వారిపై కాల్పులకు పాల్పడిన నిందితుడిని గౌరవ్ గిల్‌గా గుర్తించారు. అతడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిది కూడా పంజాబ్ రాష్ట్రమే కావడం గమనార్హం. జలంధర్‌లోని నకోదర్ పరిధిలోని హుస్సేన్‌పూర్ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండడం తదితర అభియోగాలు మోపారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులతో భారత కాన్సులేట్ మాట్లాడింది. అసలు ఈ హత్య వెనక ఉన్న కారణం ఏమిటనేది తెలుసుకోవాలని అధికారులను కాన్సులేట్ కోరింది. ఈ ఘటనపై కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జస్వీర్ కౌర్ మరణం, గగన్‌దీప్ కౌర్ గాయపడడం తీవ్రంగా బాధించిందని పేర్కొంది. వారి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బాధితులకు అన్ని విధాల సహాయం చేస్తామని తెలిపింది.