Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కరెంటుపై గ్రామసభలు …డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

విద్యుత్ సమస్య వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో లేరని రాష్ట్రంలో కొన్నిచోట్ల వింటున్నాం.. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎవరికి, ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు 1912 నెంబర్ కు ఉచితంగా ఫోన్ చేయవచ్చు అని తెలిపారు. కాల్ సెంటర్ కు ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ఫిర్యాదులు అన్ని ఆన్లైన్ లో రికార్డు అయి ఉంటాయని వివరించారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు 108 అంబులెన్స్ కు ఏ విధంగా అయితే ఫోన్ చేస్తారో, విద్యుత్ సమస్య వచ్చినప్పుడు 1912 ఫోన్ చేయాలని డిప్యూటీ సీఎం కోరారు. విద్యుత్ రంగ పరిస్థితిపై మా ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులను శ్వేత పత్రం ద్వారా చర్చకు పెట్టాం. సభలోని సభ్యులంతా విద్యుత్ అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నష్టం జరిగిందని కొందరు సభ్యులు తెలిపారు. సభలో పాల్గొన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి లేచి విద్యుత్తు కొనుగోలు అంశంపై న్యాయవిచారణ జరపాలని పదే.. పదే కోరారు. వెంటనే సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి పారదర్శకత ఉండేందుకు న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో రికార్డు అయి ఉన్నాయి, ఎవరైనా వెళ్లి చూసుకోవచ్చు అని తెలిపారు. కక్ష సాధింపు ధోరణితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వారిది అవగాహన రాహిత్యంగా భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. న్యాయవిచారణ జరగాలని నాటి విద్యుత్ శాఖ మంత్రి కోరగా, ఆ పార్టీ నేతలే కక్ష సాధింపు ధోరణి అంటున్నారు.. వారి వారికే కక్ష సాధింపులు ఉన్నాయేమో, ఎవరికి తెలుసని డిప్యూటీ సీఎం అన్నారు. ఇందిరా గాంధీ లాంటి మహానేతలే విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారని గుర్తు చేశారు. జ్యూడిషియల్ విచారణకు రామని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనుభవం కలిగిన వారు అని తెలిపారు. విచారణకు హాజరుకాము, నేను చెప్పిందే వేదం, శాసనం అంటే వారికి న్యాయవ్యవస్థ పై నమ్మకం లేదని భావిస్తున్నట్టు తెలిపారు. విచారణకు ఆదేశించడం వరకే ప్రభుత్వం పని ఆ తర్వాత విచారణకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఎలా విచారిస్తారు, ఎవరెవరిని పిలుస్తారు మాకు తెలియదని డిప్యూటీ సీఎం అన్నారు.
గత 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జమాబంధీ లేదు. కొద్దిమంది పెద్దలకు ప్రయోజనం చేకూర్చేందుకు ధరణి అనే పోర్టల్ ను తీసుకొచ్చారు. పార్ట్ – బి లో పెట్టినవి అపహరించేందుకు వేసులు బాటు కల్పించారు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ధరణి సమస్యలపై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే చెప్పాం, దానిపై కమిటీ కూడా వేసాం, ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అందరి అభిప్రాయాలను ప్రజల ముందు పెడతామని డిప్యూటీ సీఎం అన్నారు. దీనికి సంబంధించి సంపూర్ణంగా, పారదర్శకంగా ఉండేలా, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు.

Related posts

ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ !

Drukpadam

గ్రూప్-1 విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి: పోలీసులకు రేవంత్ రెడ్డి సూచన

Ram Narayana

ఐటీలో మేటి మన తెలంగాణ …రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు…

Drukpadam

Leave a Comment