- ప్రత్యేక రాష్ట్రం కావాలని నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తున్నారన్న షర్మిల
- మోదీ ప్రభుత్వంలో కింగ్ మేకర్‌గా ఉన్న చంద్రబాబు ఆ మాట ఎందుకు అనడం లేదని ప్రశ్న
- హోదా కావాలని 15 ఏళ్లు అడిగారు కదా అని గుర్తుచేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్
- అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ముందు డిమాండ్ పెట్టాలని సూచన
తమకు ప్రత్యేక హోదా కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందు పెట్టారని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు నోరు ఎందుకు మెదపడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో కింగ్ మేకర్‌గా ఉన్న చంద్రబాబు హోదా విషయంలో సైలెంట్‌గా ఎందుకున్నారని, ఈ విషయంలో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే ఏపీ వెనుకబడి వుందని, హోదా కావాలని 15 ఏళ్లు అడిగిన విషయం మీకు గుర్తులేదా? అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ‘‘రాష్ట్రాభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరిస్తామని ఎందుకు అనడం లేదు. మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ముందు హోదా డిమాండ్‌ను పెట్టాలి’’ అని చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదని, రాష్ట్రాభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని మరోమారు గుర్తుచేస్తున్నట్టు షర్మిల పేర్కొన్నారు.