- రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన యోగి ఆదిత్యనాథ్
- హథ్రాస్ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- ఘటనా ప్రాంతాన్ని పరిశీలించాలని మోదీకి రేణుకా చౌదరి సూచన
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో చోటుచేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య 122కి చేరుకుంది. రతిభాన్‌పూర్‌లో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలం వద్ద, ఆసుపత్రి వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన యూపీ సీఎం
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఈ ఘటనపై తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు. హథ్రాస్ ఘటన మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
హథ్రాస్ తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లుగా తెలిసిందని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సాయక చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మరణవార్త హృదయ విదారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
యూపీ ఘటన బాధాకరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు.
హథ్రాస్ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇండియా కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు.