- పోలీసులకు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే అధికారం
- దేశద్రోహం పేరిట ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ విరుద్ధం
- మూడు క్రిమినల్ చట్టాల అమలు- పర్యవసానాలు – ప్రమాదాలు సెమినర్లో ఐలూ రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ
- ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా అమలు : సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు అత్యంత దుర్మార్గమైనవని ఐలూ రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ చట్టాలన్నీ వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరించి వేస్తాయన్నారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన సుందరయ్య భవనంలో అదివారం ఏర్పాటు చేసిన ‘మూడు క్రిమినల్ చట్టాల అమలు- పర్యవసానాలు – ప్రమాదాలు సెమినర్ ’లో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. మూడు చట్టాలున్న శిక్షను పదేళ్లకు పొడిగించటం ఎంత వరకు సమంజసం అని కొల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సంహిత, భారతీయ సాక్షి సంహితగా మార్చడంతో పాటు కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారన్నారు. ఈ చట్టాల మార్పు వెనుక క్రమేణా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన చట్టాల్లో మార్పు పేరుతో మొత్తంగా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర దాగుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తొలగించి, ప్రతిపక్షాల వాక్ స్వాతంత్ర్యాన్ని హరించి వేస్తారన్నారు. దేశద్రోహం, రాజద్రోహం పేరుతో సెక్షన్ 152లో చేసిన మార్పుతో దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీశారనే పేరుతో పదేళ్లపాటు శిక్షించే అధికారం ఇచ్చారన్నారు. ప్రాథమిక హక్కులకు సైతం ఇది భంగం కలిగిస్తుందన్నారు. మారణాయుధాలతో తిరగ కూడదనే చట్టాన్ని సైతం రద్దు చేశారని తెలిపారు. వ్యక్తిగత ప్రైవసీని హరించేలా చట్టం చేశారన్నారు. పోలీసులకు విస్తృత అధికారాలు ఇవ్వటం సరికాదన్నారు.
- ఏకపక్షంగా అమలు: నున్నా
పార్లమెంట్ లో కానీ న్యాయవాదులతో కానీ ఎలాంటి చర్చ లేకుండానే కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చారని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఈ మూడు చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే అధికారం పోలీసులకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. దేశద్రోహం పేరిట ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించటం సరికాదన్నారు. ఈ సెమినార్ లో ఐలూ రాష్ట్ర కార్యదర్శి మందడపు శ్రీనివాసరావు, జిల్లా బార్ కౌన్సిల్ కార్యదర్శి చింతనిప్పు వెంకట్, ఐలూ జిల్లా కార్యదర్శి నల్లమల నవీన్ చైతన్య, రాష్ట్ర నాయకులు మీసాల వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.