Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

అహంకారం వల్ల ఓడిపోయామన్న వాదనల్లో నిజంలేదు …కేటీఆర్

అభ్యర్థులను మార్చినా జగన్ ఓడిపోలేదా?.. టీడీపీని చంద్రబాబు తెలంగాణలో బలోపేతం చేయడంలో తప్పులేదు

  • ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్
  • అహంకారం వల్లే ఓడిపోయామన్న ప్రచారం నిజం కాదన్న కేటీఆర్
  • నిత్యం ప్రజల్లో ఉన్నా తన మిత్రుడు కేతిరెడ్డి ఓడిపోయారని వ్యాఖ్య
  • గెలుపునకు ప్రత్యేక సూత్రం ఏదీ ఉండదన్న బీఆర్ఎస్ అగ్రనేత
  • పనైపోయిందన్న చంద్రబాబు పోస్టర్లే ఢిల్లీ నిండా ఉన్నాయన్న సిరిసిల్ల ఎమ్మెల్యే

అహంకారం వల్లే తాము ఓడిపోయామన్న వాదనలో నిజం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తామంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు తప్పితే అందులో  వాస్తవం లేదని తేల్చి చెప్పారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన నిన్న మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఎవరికీ లొంగని వ్యక్తి కాబట్టి ఆయనను తొక్కేందుకు తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారని అన్నారు. తాము అహంకారం చూపించి ఉంటే యూట్యూబ్‌లో తమపై దుష్ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టి ఉండేవారమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ. ఏపీలో చాలామంది అభ్యర్థులను మార్చినా జగన్ ఓడిపోయారని గుర్తుచేశారు. 

గెలుపునకు ఒక్క సూత్రమంటూ ఉండదు
ఎన్నికల్లో గెలుపునకు ఒక్క సూత్రం అంటూ ఉండదని వివరించారు. తాము చిన్నచిన్న తప్పులు చేసిన మాట వాస్తవమేనని, తమకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తమ వైఖరి మార్చుకుని ఉండాల్సిందన్న మాట మాత్రం వందశాతం నిజమని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోయామన్న కేటీఆర్.. 2014లో తన యాటిట్యూట్ (ధోరణి) ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని స్పష్టం చేశారు. 

జగన్‌ గెలుస్తాడని అందుకే చెప్పాం
తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికీ పెద్ద నాయకుడేనని చెప్పారు. రాజ్యసభలో కేంద్రానికి అంశాలవారీగా మద్దతిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలపై తమకున్న రిపోర్టును బట్టే జగన్ గెలుస్తారని చెప్పామని వివరించారు. ఎమ్మెల్యేలు జనాల్లో లేరు కాబట్టే ఓడిపోయారని చెప్పడానికి లేదని, తన మిత్రుడు కేతిరెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నా ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.

ఢిల్లీలో ఎక్కడ చూసినా బాబు పోస్టర్లే
ఐదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందని ప్రచారం చేశారని, ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ చూసినా చంద్రబాబు పోస్టర్లే కనిపిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు, రేవంత్ మధ్య జరిగిన సమావేశం ముఖ్యమంత్రుల మధ్య జరిగినట్టుగానే భావించాలని పేర్కొన్నారు. ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను పెట్టామని, కాబట్టి తెలంగాణలో ఆయన టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంలో తప్పులేదని అన్నారు.

Related posts

సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా రామాజీరావు ప్రస్థానం …

Ram Narayana

హైదరాబాద్‌ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!

Ram Narayana

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ పవన్ కల్యాణ్ కు సమన్లు

Ram Narayana

Leave a Comment