Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బాంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు …39 మంది మృతి

  • టీవీ ఆఫీసును తగలబెట్టిన నిరసనకారులు
  • ప్రధాని హసీనా టీవీ సందేశంపై ఆగ్రహం
  • రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు

బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారుల్లో ఏడుగురు హత్యకు గురవడంతో హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు. గురువారం ఒక్కరోజే 30 మంది మృత్యువాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు. ఈ క్రమంలో శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులను ఉద్దేశించి బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంస్థ బీటీవీ ప్రధాని వీడియో సందేశాన్ని ప్రసారం చేసింది. దీనిపై మండిపడ్డ నిరసనకారులు గురువారం ఢాకాలోని బీటీవీ హెడ్డాఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులపైకి పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బీటీవీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ఫ్రంట్ ఆఫీసుకు నిప్పంటించారు. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగడంతో చాలామంది ఉద్యోగులు లోపలే చిక్కుకుపోయారని బీటీవీ తెలిపింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే రెస్క్యూ సిబ్బంది సాయంతో అందరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చినట్లు ప్రకటించింది.

ఆఫీసు పార్కింగ్ ప్లేస్ లోని పలు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారని వివరించింది. ఈ ఘటనలో పలు పరికరాలకు నిప్పంటుకోవడంతో బీటీవీ ప్రసారాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మృతిచెందిన నిరసనకారులకి న్యాయం జరగాలని, ప్రధాని హసీనా క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలుపుదల చేసింది.

అల్లర్లకు కారణం ఇదే..
బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రిజర్వేషన్ వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం మొత్తం ఉద్యోగాలలో 56 శాతం వివిధ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేస్తారు. ఇందులో ప్రధానంగా 1971లో పాకిస్థాన్ తో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. మిగతా వెనకబడిన కేటగిరీల అభ్యర్థులు 26 శాతం ఉద్యోగాలు దక్కించుకుంటారు. మొత్తం ఉద్యోగాలలో మూడో వంతు మాజీ సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలకే దక్కడంపై బంగ్లాదేశ్ యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ గతంలోనూ విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఫలితంగా ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ నియామకాల్లో 2018లో రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మాజీ సైనికుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది జులై 1 న 1971 యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలకు 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మరోసారి విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. హైకోర్టు తీర్పుపై అటార్నీ జనరల్ జులై 16న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును నాలుగు వారాల పాటు సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

ఆగస్టు 7న ఈ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆందోళనలకు స్వస్తి పలికి క్లాసులకు హాజరు కావాలంటూ విద్యార్థులకు సూచించింది. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. దీంతో విద్యార్థులపై ప్రధాని హసీనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకారులను రజాకార్లంటూ విమర్శించారు. ఇది కాస్తా విద్యార్థుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఫలితంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించగా.. ఇద్దరు విద్యార్థులు గాయపడి ప్రాణాలు కోల్పోయారు. 

తోటి విద్యార్థుల మరణంతో రెచ్చిపోయిన స్టూడెంట్లు పోలీసులపై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరపడంతో మరో ఐదుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రధాని షేక్ హసీనా బీటీవీ ద్వారా విద్యార్థులను శాంతియుతంగా ఉండాలని కోరారు. ఈ క్రమంలోనే గురువారం బీటీవీ హెడ్డాఫీసుపై విద్యార్థులు దాడి చేశారు. గురువారం ఒక్కరోజే 30 మంది స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 39 కి చేరింది.

Related posts

జెట్ లాగ్ వల్ల ఆ రోజు స్టేజ్ పై నిద్ర ముంచుకొచ్చింది..: బైడెన్

Ram Narayana

కావాల్సినంత డబ్బుంది… ఇంతవరకు తోడు లేదు… ఓ సంపన్నుడి విచిత్ర గాథ!

Ram Narayana

దేశ వనరులు వృథా అవుతున్నాయి.. బంగ్లా అల్లర్ల‌పై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన!

Ram Narayana

Leave a Comment