- 2002లో గొంతు క్యాన్సర్ బారిన పడ్డ జెఫ్రీ బాయ్‌కాట్
- చికిత్స అనంతరం కోలుకున్న క్రికెట్ దిగ్గజం
- ఇటీవల మళ్లీ తిరగబెట్టడంతో ఆసుపత్రిలో చేరిక
- తాజాగా, న్యుమోనియాతో పరిస్థితి విషమం
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ (80) మరోమారు ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్టు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. బాయ్‌కాట్ 2002లో తొలిసారి క్యాన్సర్ బారినపడ్డారు. కీమో థెరపీ అనంతరం కోలుకున్నారు. అయితే, ఈ ఏడాది మేలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
తాజాగా, ఆయన ఆరోగ్యం మరోమారు విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. తన తండ్రి కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మద్దతు ఇస్తున్న అశేష అభిమానులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్న ఆమె.. దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం కొంత విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని, ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తామని పేర్కొన్నారు.