- టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో జగన్ దీక్ష
- నిన్న అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి
- జగన్‌తో వెళ్లకుండా మండలికి హాజరైన తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయన నిన్ననే ఢిల్లీ వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వల్ప వ్యవధిలోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపిస్తూ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా నేడు ఇదే కారణంతో ఢిల్లీలోనూ నిరసనకు సిద్ధమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు కూడా చేయనున్నారు.
నిన్న అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అయితే, వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం జగన్‌తో ఢిల్లీ వెళ్లకుండా నిన్న శాసనమండలికి హాజరు కావడం చర్చనీయాంశమైంది. వీరిని చూసిన ఇతర నేతలు చర్చించుకోవడం కనిపించింది. రాజకీయంగానూ ఇది చర్చకు దారితీసింది.