Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

ఇదో అద్భుతం …610 కేజీల నుంచి 63 కేజీలకు తగ్గాడు… రాజు తలచుకుంటే అంతే…!

  • ఒకప్పుడు ప్రపంచంలోనే బరువైన వ్యక్తిగా ఉన్న ఖాలిద్ షారీ
  • కింగ్ అబ్దుల్లా దృష్టికి వెళ్లడంతో దశ తిరిగిన వైనం
  • కింగ్ అబ్దుల్లా ఆదేశాలతో షారీకి ప్రత్యేక వైద్య సేవలు
  • ఏకంగా 547 కిలోలు తగ్గిన షారీ

ఖాలిద్ షారీ… ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువు కలిగిన వ్యక్తి. మామూలు బరువు కాదు… 2013లో ఇతగాడు అర టన్నుకు పైగా బరువు తూగాడు. 610 కేజీల బరువుతో చిన్న సైజు కొండలా మారిపోయాడు. చివరికి కదల్లేని స్థితిలో మంచానికి పరిమితయ్యాడు. 

కానీ ఇప్పుడు ఖాలిద్ షారీ బరువు 63 కిలోలే. ఏకంగా 547 కిలోల బరువు తగ్గి, ఓ ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఎంత బరువు ఉండాలో అంత బరువుకు చేరుకున్నాడు. దీనికంతటికీ కారణం సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా. 

వివరాల్లోకెళితే… 2013లో ఖాలిద్ షారీ అత్యంత అధిక బరువుతో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉన్న విషయం కింగ్ అబ్దుల్లా దృష్టికి వెళ్లింది. ఆయన మానవతా దృక్పథంతో స్పందించి, షారీకి వైద్యం సాయం అందించాలని నిర్ణయించారు. 

ఆ అభాగ్యుడ్ని ఆదుకునేందుకు ఒక సమగ్ర వైద్య ప్రణాళికను రూపొందించారు. కేవలం ఖాలిద్ షారీ కేసును పర్యవేక్షించేందుకే 30 మంది డాక్టర్లను నియమించారు. సరకు రవాణా కేంద్రాల్లో ఉపయోగించే ఫోర్క్ లిఫ్ట్ వాహనంతో అతడ్ని బెడ్ తో సహా జజాన్ లోని అతడి నివాసం నుంచి రియాద్ లోని కింగ్ ఫాద్ మెడికల్ సిటీ ఆసుపత్రికి ఓ ప్రత్యేక వాహనంలో తరలించారు. 

ఇక, బరువు తగ్గించే చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రత్యేకంగా అతడి కోసం ఆహార పట్టికను రూపొందించారు. డాక్టర్లు పేర్కొన్న మేరకు అతడికి పరిమితంగా ఆహారం అందించేవారు. అంతేకాదు, తీవ్రస్థాయిలో కసరత్తులు చేయించారు. అత్యంత ప్రత్యేక శ్రద్ధ, అదనంగా ఫిజియోథెరపీ వంటి చికిత్స విధానాలతో షారీ మొదటి ఆరు నెలల్లోనే సగానికి పైగా బరువు తగ్గాడు. 

2023 నాటికి అతడి బరువు 63.5 కిలోలకు తగ్గింది. అంతబరువు తగ్గడానికి, పలుమార్లు నిర్వహించిన శస్త్రచికిత్సలు కూడా కారణం అయ్యాయి. చర్మం కింద బాగా కొవ్వు పట్టి ఉండడంతో, ఆ మేరకు శస్త్రచికిత్సల ద్వారా చర్మం పొరలను తొలగించారు. 

ఒకప్పుడు షారీని ఎక్కడికైనా తరలించాలంటే అతడి కుటుంబానికి చుక్కలు కనిపించేవి. అతడ్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం ఒక ప్రహసనంలా అనిపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. షారీ చక్కని చిరునవ్వుతో ఎంచక్కా తనపాటికి తాను తిరగ్గలుగుతున్నాడు. డాక్టర్లు కూడా అతడికి ‘ది స్మైలింగ్ మేన్’ అని ఓ నిక్ నేమ్ కూడా తగిలించేశారు. 

సరైన వ్యక్తులు జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా మారిపోతుంది? అంకితభావంతో కూడిన వైద్య సేవలతో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? అనేందుకు ఖాలిద్ షారీ ఉదంతమే నిదర్శనం.

Related posts

ఒకటి, రెండు, మూడు రోజులు కాదు.. లక్షల ఏళ్లపాటు ఆగని వాన!

Ram Narayana

వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్

Ram Narayana

అమెరికాలోని హవాయి దీవుల్లో దోమల ట్రీట్ మెంట్ …!

Ram Narayana

Leave a Comment