ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం మన దేశంలోనే ఉంది.. ఆ గ్రామస్తుల ఫిక్సుడ్ డిపాజిట్లు రూ. 7 వేల కోట్లు!
- గుజరాత్ లోని మాదాపార్ గ్రామం సూపర్ రిచ్
- ఈ గ్రామంలో ఎక్కువ మంది ఎన్నారైలే
- విదేశాల్లో నివసిస్తున్న 1,200 కుటుంబాలు
- గ్రామంలో 17 బ్యాంకులు
- తమ సంపాదనను స్వగ్రామంలోనే డిపాజిట్ చేస్తున్న ఎన్నారైలు
ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందని అడిగితే… ఎవరైనా జపాన్ లోనో, చైనాలోనో ఉందని చెపుతారేమో. కానీ, ఆసియా రిచ్చెస్ట్ విలేజ్ మన దేశంలోనే ఉంది. ఇండియాలో బిజినెస్ డెస్టినేషన్ అయిన గుజరాత్ లో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు మాదాపార్. కచ్ ప్రాంతంలోని భుజ్ శివార్లలో ఈ గ్రామం ఉంది.
మాదాపార్ గ్రామ ప్రజల ఫిక్సుడ్ డిపాజిట్లు ఏకంగా రూ. 7 వేల కోట్లు. ఇది చాలు… ఈ గ్రామస్తులు ఎంత ధనికులో చెప్పడానికి. ఈ గ్రామ జనాభా 32 వేలు. మాదాపార్ లో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్ లతో పాటు 17 బ్యాంకులు ఉన్నాయి. ఒక్క గ్రామంలో ఇన్ని బ్యాంకులు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ గ్రామంలో బ్రాంచ్ లను ఓపెన్ చేసేందుకు మరిన్ని బ్యాంకులు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
మాదాపార్ లో ఎక్కువగా పటిదార్ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా ఎన్నారై కుటుంబాలు ఉన్నాయి. వీరంతా ప్రతి ఏటా కోట్లాది రూపాయలను స్థానిక బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 20 వేల కుటుంబాలు ఉండగా… 1,200 కుటుంబాలు విదేశాల్లో నివసిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో ఉండగా… మిగిలిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో ఉంటున్నారు. ఆఫ్రికాలో నిర్మాణ రంగంలో ఎక్కువగా గుజరాతీలు ఉన్నారు.
మాదాపార్ గ్రామస్తులు విదేశాల్లో ఉంటున్నప్పటికీ… అందరూ తమ స్వగ్రామానికే కనెక్ట్ అయి ఉన్నారు. తమ సంపాదనను విదేశాల్లో కాకుండా… తమ గ్రామంలోని బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నారు. ఈ గ్రామంలో పెద్దపెద్ద బంగ్లాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్పిటల్స్ తో పాటు రోడ్లు, నీరు, విద్యుత్ సహా అన్ని వసతులు ఉన్నాయి.