Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

రోజూ 30 నిమిషాలు నడిస్తే 8 లాభాలు!


నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. నడకను మించిన తేలికపాటి వ్యాయామం మరొకటి లేదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు నడిచినా చాలు 8 లాభాలు కలుగుతాయట. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ ప్రయోజనాల గురించి వివరించారు. అవేంటో చూద్దాం.

1. గుండె పదిలంగా ఉంటుంది

ప్రతి రోజూ నడక అనేది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అద్భుతమైన మార్గం. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఏం చెబుతోందంటే… రోజులో కనీసం 30 నిమిషాలు నడిస్తే గుండె జబ్బుల ముప్పును 19 శాతం తగ్గించుకోవచ్చట. నడక ద్వారా రక్తపోటు నియంత్రణ, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం, తద్వారా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

2. బరువు నియంత్రణలో ఉంటుంది

ఎవరైనా గానీ తమ దినచర్యలో 30 నిమిషాల నడకను కూడా చేర్చుకుంటే ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చు. నడక వల్ల కెలోరీలు కరగడంతో పాటు బరువు తగ్గుతారు. అయితే ఎన్ని కెలోరీలు ఖర్చవుతాయన్నది నడిచే వ్యక్తి బరువు పైనా, వేగంపైనా ఆధారపడి ఉంటుంది. సగటున ఓ వ్యక్తి అరగంట పాటు నడిస్తే 150 కెలోరీలు ఖర్చవుతాయట.

3. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

నడక శరీరానికే కాదు… మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జేఏఎంఏ సైకియాట్రీ చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం… ప్రతి రోజూ వాకింగ్ చేయడం ద్వారా కుంగుబాటు, మానసిక ఆందోళన తగ్గుముఖం పడతాయట. మనిషిలో కలిగే భావాలను నియంత్రించే ఎండోమార్ఫిన్స్ ను నడక ఉత్తేజపరుస్తుందని గుర్తించారు. నడక ద్వారా మానసిక ఒత్తిడి కూడా మటుమాయం అవుతుంది.

4. కండరాలు, ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది

నిత్యం నడిస్తే కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా, కాళ్లకు, నడుము భాగం పటిష్టతకు నడక ఎంతో దోహదపడుతుంది. నడక వల్ల ఎముకల సాంద్రత పెరగడమే కాదు, ఆస్టియోపొరోసిస్ ముప్పు తగ్గుతుందట. ఎముకలు విరగడం వంటి వాటిని నిరోధించవచ్చని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్థ్రయిటిస్ అండ్ మస్క్యులోస్కెలెటల్ అండ్ స్కిన్ డిసీజెస్ వెల్లడించింది. 

5. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

భోజనం తర్వాత అరగంట నడిస్తే జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది. జీర్ణాశయంలోని కండరాలు ఉత్తేజితం కావడానికి నడక సాయపడుతుంది. అంతేకాదు, పేగుల్లో కదలికలు వృద్ధి చెందుతాయి. తద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారి పరిశోధన చెబుతోంది.

6. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

వాకింగ్  చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ నడిచేవాళ్లు చలికాలంలో అనారోగ్యాలకు గురికావడం చాలా తక్కువ అని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. రోజులో కనీసం 30 నిమిషాలు నడిచేవాళ్లకు జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువసార్లు బాధించాయట.

7. క్రియేటివిటీ పెరుగుతుంది

నడక వల్ల శారీరక ప్రయోజనాలే కాదు… మానసికంగానూ లాభాలున్నాయి. రోజూ నడిచేవారిలో క్రియేటివిటీ మెరుగవుతుందట. అంతేకాదు, వారు ఎంతో చురుగ్గా ఉంటారని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. నడక వల్ల సగటున 60 శాతం సృజనాత్మకత పెరుగుతుందని వారు వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే మనసు కుదుటపడడమే కాకుండా, చక్కని ఐడియాలు వస్తాయట.

8. దీర్ఘాయుష్షు మీ సొంతం అవుతుంది

ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా… అయితే మీ దైనందిన చర్యల్లో నడకను కూడా ఓ భాగం చేయాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం… ప్రతి రోజూ 30 నిమిషాలు నడిస్తే అకాల మరణం పొందే ముప్పును 20 శాతం తగ్గించుకోవచ్చట. నడక వల్ల కార్డియో వాస్కులార్ ఆరోగ్యం మెరుగవడమే కాకుండా, బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా, దీర్ఘాయుష్షును కలిగిస్తుంది.

Related posts

మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా..? ఇలా చేస్తే చాలు!

Ram Narayana

ఈ ఐదూ పాటిస్తేనే.. కొలెస్ట్రాల్‌ టెస్ట్‌ లో కరెక్ట్‌ రిపోర్ట్‌!

Ram Narayana

సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ సాధ్యమే: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Ram Narayana

Leave a Comment