Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్…

  • హేమ కమిటీ రిపోర్టుతో సిట్ ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం
  • నాటి లైంగిక వేధింపులపై మీడియా ముందు వెల్లడిస్తున్న మహిళా ఆర్టిస్టులు  
  • బాత్ రూమ్‌కు వెళ్లి వస్తుండగా జయసూర్య వెనుక నుండి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడని ఓ నటి ఆరోపణ

కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కొంత మంది నటులు, నిర్మాతలు, దర్శకులు .. మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, తీవ్ర ఇబ్బందులు పెట్టారని పేర్కొంది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను సీరియస్‌గా తీసుకున్న పినరయి విజయన్ సర్కార్ .. విచారణ చేపట్టాలని నిర్ణయించింది. వెంటనే ఇందుకోసం ఏడుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించారు.

ఓ నటి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వివరించారు. నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించి, దూషించారని ఆరోపించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జయసూర్య కారణంగా చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తుండగా, జయసూర్య వెనుక నుండి వచ్చి తనను కౌగిలించుకొని ముద్దు పెట్టాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను అక్కడ నుండి వెళ్లిపోయానని ఆమె తెలిపారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జయసూర్య ఆ తర్వాత తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నారు. 

అసోసియేషన్ లో సభ్యత్వం కోసం మలయాళీ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును తాను సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడని, తాను వెళ్లగా ఆయన శారీరకంగా వేధించాడని మరో మలయాళీ నటి ఆరోపించింది. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం ముకేశ్, మణియన్‌పిళ్ల రాజుపై కూడా ఆమె ఇదే విధమైన ఆరోపణలు చేశారు. వేధింపుల కారణంగా మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా గతంలో చిత్ర సీమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు మీడియా ముందుకు వస్తుండడం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది.

Related posts

అహమ్మదాబాద్ – ఢిల్లీ మధ్య దూసుకుపోనున్న బుల్లెట్ ట్రైన్..!

Ram Narayana

ఎంపీల సస్పెన్షన్‌‌పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత మల్లు రవి

Ram Narayana

బీజేపీపై ముకుల్ కుమారుడి ఫైర్,,,

Drukpadam

Leave a Comment