- అమెరికాలో టీచర్ గా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్‌కు చెందిన ప్రవీణ్
- స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
- మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడు ప్రవీణ్ అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. తన ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ ఫూల్‌లో ఈతకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగింది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్లపహాడ్‌కు చెందిన ప్రవీణ్ (41) హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. కొంత కాలం ఆస్ట్రేలియాలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. భార్య శాంతితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ శనివారం ఉదయం స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు.
ప్రవీణ్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య శాంతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పాతర్లపహాడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రవీణ్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ద్వారా సహకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.