- కాంట్రాక్ట్ స్వీపర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన హర్యానా ప్రభుత్వం
- 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు
- స్వీపర్ పోస్టుకు నెలకు ఇచ్చేది రూ. 15 వేలే
- ఉన్నత కుటుంబాల నిరుద్యోగులు కూడా దరఖాస్తు
దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ (హెచ్‌కేఆర్ఎన్) దరఖాస్తులు ఆహ్వానించింది.
1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు కూడా..
నోటిఫికేషన్ వచ్చీరావడంతోనే 39,990 మంది గ్రాడ్యుయేట్లు, 6,112 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 మధ్య ఆన్‌లైన్‌లో 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పొందినవారు ప్రభుత్వ విభాగాలు, బోర్డులు, కార్పొరేషన్లు, పౌర సంస్థల్లోని కార్యాలయాల్లో ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనిచేయాల్సి ఉంటుంది. స్వీపర్లకు నెలకు రూ. 15 వేల వేతనం చెల్లిస్తారు.
అగ్రవర్ణాల వారు కూడా..
అంబాలా జిల్లా నరైన్‌గఢ్‌లోని అగ్రవర్ణ కులానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ మనీశ్‌కుమార్, ఆయన భార్య రూప కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మనీశ్ బిజినెస్ స్టడీస్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేయగా, రూప టీచర్ క్వాలిఫయర్. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీల్లో రూ. 10 వేల వేతనానికి దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగం రాలేదని వాపోయారు. వచ్చే ఏడాది అయినా ఉద్యోగం రెగ్యులర్ అవుతుందన్న ఉద్దేశంతోనే స్వీపర్ పోస్టుకు దరఖాస్తు చేసినట్టు చెప్పారు. దీనికి తోడు ఊడ్చే ఉద్యోగం రోజంతా ఉండదని, కాబట్టి మిగతా సమయంలో మరో పనిచేసుకోవచ్చని పేర్కొన్నారు.