నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి
ఇటీవల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
గుంటూరు జైలు వద్దకు వచ్చిన జగన్
ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి, గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేశ్ తో ‘ములాఖత్’ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేశ్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేశ్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజిలో కనిపించాలి కదా… అని వ్యాఖ్యానించారు.
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారు… అయినా గానీ చంద్రబాబులా కక్షసాధింపు చర్యలకు దిగలేదు అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని, వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు.
రెడ్ బుక్ అంటున్నారని, అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనను నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైనే శ్రద్ధ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు.
టీడీపీ గెలవగానే ఆ బోట్లపై విజయోత్సవాలు చేసుకోలేదా…?
వాతావరణ హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. బాబు తన ఇంటిని కాపాడుకునేందుకు విజయవాడను బలి చేశారని, బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడ వరదలకు కారణమయ్యారని ఆరోపించారు. తద్వారా 60 మంది ప్రాణాలు కోల్పోయారని, మరి చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టరు? అని జగన్ ప్రశ్నించారు.
ఆఖరికి చంద్రబాబు బోట్లతోనూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ బోట్లకు ఎవరి హయాంలో అనుమతి వచ్చిందో తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించగానే, ఇవే బోట్లపై విజయోత్సవాలు చేసుకున్నారని… అన్నింటికీ మించి బాబు, లోకేశ్ తో కలిసి బోట్ల యజమాని ఉషాద్రి ఫొటోలు కూడా దిగాడని జగన్ వెల్లడించారు.
టీడీపీ వాళ్లకు చెందిన బోట్లను వైసీపీ నేతలవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.