Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మార్క్సిస్ట్ యోధుడు ,గొప్పమేధావి ,సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు!

సిపిఎం ప్రధానకార్యదర్శి ,మార్క్సిస్ట్ యోధుడు , సామజిక , ఆర్థిక వేత్త,మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి (72) ఇకలేరు అనే వార్తను కమ్యూనిస్ట్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి…మేధావిగా ,మార్క్సిస్ట్ గా , రాజ్యసభలోను ,వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాల్లో తనదైన ముద్ర వేశారు …ఆయన ప్రసంగాలు అంటే మేథావులు సైతం చెవులు కోసుకొని వారు …సంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన ఏచూరి మార్క్సిస్ట్ యోధుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు …అత్యంత ప్రతిష్టాత్మకమైన జవర్ లాల్ నెహ్రు యూనివర్సిటీకి ఆయన మూడు సార్లు అధ్యక్షులుగా ఎన్నికైయ్యారు …

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన ఏచూరి.. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

సీతారాం ఏచూరి మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ లో ఇంజినీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్ యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీ హెచ్ డీ లో చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.

ఎస్ఎఫ్ఎ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరాత్తో కలిసి జేఎన్ యూను వామపక్ష కోటగా మార్చారు. ఎస్ఎఫ్ఎ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

జెఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా సీతారాం ఏచూరి ఆ యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఉన్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ని రాజీనామా చేయమని కోరుతూ ఆమెకే ఒక మెమోరాండం ను ఆమె ఇంటి వద్దనే ఇచ్చాడు , ఆమె చిరునవ్వుతో ఆ మెమోరాండం అంశాలను శ్రద్ధగా వినడం ఫోటో లో గమనించవచ్చు ……

సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్ కు దానం చేసిన కుటుంబ సభ్యులు

Family donates Sitaram Yechury mortal remains to AIIMS
  • తీవ్ర అనారోగ్యంతో సీతారాం ఏచూరి కన్నుమూత
  • వైద్య విద్యార్థులకు బోధనలో భౌతికకాయం ఉపయోగించుకోవాలన్న కుటుంబం 
  • ఓ ప్రకటన ద్వారా వెల్లడించిన ఢిల్లీ ఎయిమ్స్

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేడు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన… ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

కాగా, ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్చ్ లో ఏచూరి భౌతికకాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ను కోరారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

సీతారాం ఏచూరి నాకు ప్రియమిత్రుడు: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu said Sitaram Yechury was his dear friend

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు భావజాలానికి ప్రతినిధి అయినప్పటికీ, తమ మధ్య చక్కని స్నేహం వెల్లివిరిసిందని తెలిపారు. సీతారాం ఏచూరి తనకు ప్రియమిత్రుడు అని వెల్లడించారు. ఇద్దరం ఎప్పుడు కలిసినా జాతీయ సమస్యల గురించే మాట్లాడుకునేవాళ్లమని వెంకయ్యనాయుడు వివరించారు. 

వక్తగా ఎంతో ప్రభావశీలి అని, స్పష్టత ఉన్న పార్లమెంటేరియన్ అని కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నానని, కానీ అంతలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.

సీతారాం ఏచూరి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సీతారాం ఏచూరి మృతి పట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 

ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వివరించారు. 

సీతారాం ఏచూరి మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ నామ సంతాపం
ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను…
విలువలు, సిద్ధాంతాల కలబోతనే ఏచూరి రాజకీయ జీవితం – మాజీ ఎంపీ నామ

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఏం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయానని నామ ఆవేదన వ్యక్తం చేశారు. 15వ లోక్ సభ సమయంలో తన గెలుపుకోసం మిత్రపక్షాలు చేసిన కృషిని, థర్డ్ ఫ్రంట్ లో ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించిన విషయాన్ని నామ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశం ఒక ప్రజా పోరాట యోధుడిని కోల్పోయిందని, విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారాం ఏచూరి ఆదర్శప్రాయులన్నారు. భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని ఆయన విద్యార్జనలో కూడా అగ్రగామిగా నిలిచిన సీతారాం, ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్ స్కూల్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన ఆయన సీబీఎస్​ఈ పరీక్షల్లో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారని, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయం లో అరెస్ట్ అయిన ఏచూరి, తన ప్రస్థానాన్ని మరింత పదిలపరిచి, ప్రజల పక్షాన నిలిచిన నాయకుడున్నారు. ఆయన పార్లమెంటులో ఎన్నో సమస్యలను ప్రజల కోసం చర్చించి, ప్రశ్నించిన మేటి నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి గారు ఆదర్శప్రాయులని తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

ఏచూరి మృతి దేశానికి నష్టం

  • పీడిత ప్రజలకు తీరని లోటు
  • కమ్యూనిస్టు ఉద్యమాల కీలక తరుణంలో దూరమయ్యారు
  • సీపీఐ (ఎం) తెలంగాణ కమిటి తరఫున ఏచూరి మృతికి సంతాపం
  • పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం, సెప్టెంబర్‌ 12: – మతోన్మాదం పెచ్చరిల్లుతున్న తరుణంలో సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం దేశానికి తీరని నష్టమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మికవర్గానికి, పీడిత ప్రజలకు ఆయన మరణం అత్యంత లోటని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌లో తమిళనాడులో పార్టీ జాతీయ మహాసభలలో కీలక కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టాల్సిన తరుణంలో ఏచూరి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు దూరమవడం విషాదకరమని అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం ఏచూరి చిత్ర పటానికి పూలమాల వేసి మృతికి సంతాపం తెలిపిన అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో పుట్టినా వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై ప్రజాతంత్ర ఉద్యమాలను నిర్మించడంలో కీలక భూమిక పోషించారని తెలిపారు. 5వ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివిన ఏచూరి వామపక్ష భావాలవైపు ఆకర్షితుడవుతుండటంతో ఆయన తల్లిదండ్రులు ఢల్లీి తీసుకు వెళ్ళారని చెప్పారు. అయినప్పటికీ ఆయనలోని వామపక్ష భావజాలాన్ని దూరం చేయలేకపోయారని తెలిపారు. ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ అధ్యక్షుడిగా 3 దఫాలు ఎన్నికయ్యారన్నారు. జేఎన్‌యూ లో ప్రకాష్‌ కరత్‌, బృందా కరత్‌ సహచరునిగా వున్న విషయాన్ని గుర్తు చేశారు. 1985లో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సీతారాం ఏచూరి అంతర్జాతీయ కమ్యూనిస్టు సంబంధాల విభాగాలకు నేతృత్వం వహించారని తెలిపారు. వియత్నాం, చైనా, రష్యా తదితర దేశాలతో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తిపై సైద్ధాంతిక చర్చలు జరిపారని గుర్తు చేశారు. ఆర్థిక రంగాన్ని విశ్లేషించడంలో దేశంలోనే ఏచూరిని మించిన వారు ఉండకపోవచ్చని అన్నారు. పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యునిగా ఆయన ఉపన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని గుర్తు చేశారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లాంటి వారు కూడా వారి సెషన్‌ లేనప్పటికీ, ఏచూరి ప్రసంగాలు వినేందుకు పార్లమెంట్‌కు హాజరైన సందర్భాలున్నాయన్నారు. సైద్ధాంతిక, రాజకీయ దృఢచిత్తం, స్నేహపూర్వకంగా మెలిగేతత్వం, నేర్చుకునే గుణగణాలున్న వ్యక్తి ఏచూరి అని విశ్లేషించారు. 2015 విశాఖపట్నం మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సైద్ధాంతిక వ్యాప్తికి కృషి చేశారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. జిల్లాలో అనేక రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య వక్తగా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల క్యాంపెయిన్‌లోనూ పాల్గొన్నారని తెలిపారు. 1988లో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైనారని, 1990లో తాను ఎన్నికైన విషయాన్ని తమ్మినేని గుర్తు చేశారు. ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని అన్నారు. చాలా కీలక సందర్భంలో దేశానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి అవసరమైన తరుణంలో ఏచూరి మృతి చెందారని అన్నారు. ఏచూరి మృతి దేశానికి, కార్మికవర్గానికి, పీడిత ప్రజలకు ఎంతో నష్టమని చెప్పారు. 14వ తేదీ మధ్యాహ్నం వరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌లో సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఉంచుతారని, ఆ తర్వాత పరిశోధనల నిమిత్తం హాస్పిటల్‌కు అప్పగిస్తారని చెప్పారు. ఏచూరి మృతికి పార్టీ తెలంగాణ కమిటీ తరఫున సంతాపం ప్రకటిస్తున్నట్లు తమ్మినేని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ సంతాప కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, బండి రమేష్‌, వై.విక్రం, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, సీనియర్‌ నాయకులు పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, ఐలు రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, సీతారాం ఏచూరితో ప్రత్యక్ష సంబంధం వున్న అనేకమంది న్యాయవాదులు, ఇతర ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఏచూరి మృతిపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సంతాపం.

సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిపట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సంతాపాన్ని ప్రకటించారు. విద్యావేత్తగా ఉన్న ఏచూరి సిపిఎం పార్టీలో చేరి క్రియాశీలంగా నిలిచారని, అనేక ప్రజా, కార్మికోద్యమాలను నాయకత్వం వహించారని, దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. సిపిఎం, అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగాడని అన్నారు. బలమైన రాజకీయ నాయకున్ని దేశం కోల్పోయిందని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

ఏచూరి మృతి పట్ల సిపిఐ సంతాపం
ఏచూరి మరణం తీరని లోటు : పువ్వాడ

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల సిపిఐ ఖమ్మంజిల్లా సమితి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు తన సంతాప సందేశంలో నిబద్దత కలిగి ప్రజా ఉద్యమనేతగా పేరొందిన ఏచూరి మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఏచూరి అంచలంచెలుగా ఎదిగారని ఆయన తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ పునర్ వైభవానికి తన వంతు కృషిని కొనసాగించారని పువ్వాడ తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి, బలోపేతానికి కృషి చేయడమే ఏచూరికి సరైన నివాళి అన్నారు. సంతాపం తెలిపిన -వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

Related posts

భారతదేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Ram Narayana

తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ సరెండర్…

Ram Narayana

సోనియా గాంధీ రిటైర్మెంట్ వార్తలపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ!

Drukpadam

Leave a Comment