- రిజర్వేషన్లపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న బీజేపీ
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదు
- ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ (గురువారం) ఢిల్లీలోని మూడు పోలీస్ స్టేషన్లలో రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. పంజాబీ బాగ్, తిలక్ నగర్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో ఈ ఫిర్యాదులు దాఖలయ్యాయి.
రిజర్వేషన్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేలా, రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఒక ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ అంతర్గత భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని తెలిపారు.
కాగా రాహుల్ గాంధీపై ఫిర్యాదులు చేసినవారిలో బీజేపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మోహన్ లాల్ గిహారా, బీజేపీ సిక్కు సెల్ సభ్యుడు చరణ్‌జిత్ సింగ్ లవ్లీ, పార్టీ ఎస్టీ విభాగం సభ్యుడు సీఎల్ మీనా ఉన్నారు.
కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఎఫ్ఐఆర్…
భారత్‌లో సిక్కుల పరిస్థితిపై ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. దీనికి ప్రతీకారంగానే బీజేపీ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు.