- ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
- ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
- తనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదని ఏ2 అంటున్నాడని వెల్లడి
- రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని విమర్శలు
ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి… ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలతో గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు యజ్ఞంలా పని చేస్తున్నామని, నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేసి చూపుతామని స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజలు బుద్ధి చెప్పడంతో ఇంట్లో కూర్చున్నారు!
ప్రజలు బుద్ధి చెప్పడంతో ఓడిపోయి ఇంట్లో కూర్చుని 3 నెలల్లోనే అది చేయలేదు…ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు. వారు 6 నెలలదాకా ఒక్కపనైనా చేశారా? మూడు బోట్లను కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు. ఆ పడవలు వేగంగా వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. అదే గేట్లను ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం ఏర్పడేది.
సొంత బాబాయినే చంపి గుండె పోటు అని ప్రచారం చేశారు…తర్వాత నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశారు. నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టడం అలవాటుగా మారింది. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ముంబయి నటిని సంబంధం లేని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టారు… చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే మళ్లీ విమర్శలు చేస్తున్నారు.
ఏ2 మాట్లాడుతున్నాడు… నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి తెలీదంట. నా అటెన్షన్ ఎవరూ డైవర్షన్ చేయలేరు. ప్రతి ఇంటికీ విద్యుత్, నీటి కనెక్షన్ ఇస్తాం. దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఇల్లులేని ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మాణం
ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ఇళ్లు లేవు… వారందరికీ స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. తద్వారా బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా బలపడతాయి.గాడి తప్పిన పాలన గాడిన పెడుతున్నాం.
ప్రభుత్వ ఆస్తులు, పరువును కాపాడుతున్నాం
విచ్చలవిడితనంతో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వానికి కూడా పరువు, ఆస్తులు ఉంటాయి. వాటిని పోగొట్టుకోకూడదు. అందుకే ప్రభుత్వ ఆస్తులు, పరపతిని కాపాడుకుంటూ వస్తున్నాం. 7 ప్రధాన అంశాలపై శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవాలు మీ కళ్లముందు ఉంచాం.
శాఖలపై సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేంద్రం నుండి వచ్చిన నిధులు దారి మళ్లించారు. పంచాయతీలకు రూ.990 కోట్లు ఇవ్వలేదు…వాటిని మేమొచ్చి ఇవ్వడంతో కేంద్రం నుండి రూ.12 వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
చాలా రాష్ట్రాలు రాష్ట్రవాటా నిధులు ఖర్చు పెట్టి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. అందుకే మళ్లీ సమీక్షలు చేసి రూ.500 కోట్లు రాష్ట్రం వాటా విడుదల చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించాం.
అందుబాటులో ఉంటే ఉచితంగా ఇసుక తెచ్చుకోండి
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే మీ భూమి మీకు దక్కకుండా పోయేది.
ఇక్కడే గుండ్లకమ్మ ఉంది. మీకు అందుబాటులో ఉన్న చోటనుండి స్వేచ్ఛగా ఇసుక తీసుకెళ్లండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడి నుండి ఇసుక తీసుకెళ్లండి. కానీ అతిగా తవ్వకుండా భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా తవ్వకాలు చేయాలని సూచిస్తున్నా. ఇసుక దొరకని ప్రాంతాల వారు 24 గంటల పాటు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. కేంద్రం కూడా మంచి కార్యక్రమాలు చేస్తోంది… వాటిని కూడా వినియోగించుకుందాం.