ఆ ఏడుకొండలవాడే నాతో లడ్డూ గురించి మాట్లాడించాడేమో!: సీఎం చంద్రబాబు
- తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఏపీ సీఎం
- మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష
- సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశం
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని చెబుతూ.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఈమేరకు శనివారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో….మనం నిమిత్త మాత్రులం…..దేవుడే అన్నీ చేయిస్తాడు… ఇదీ అంతే అనుకుంటున్నా” అని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ తరహాలో తయారు చేయడం ఎవరి వల్ల కాలేదు
తిరుమల శ్రీవారి లడ్డు కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. వందల ఏళ్లుగా శ్రీవారి లడ్డూ అక్కడ తయారవుతోంది. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చూశారు. ఇక్కడ నుంచి కార్మికులను తీసుకువెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. ఈ విషయం నాకు అక్కడి వారే చెప్పారు. అంత మహత్మ్యం ఉన్న ప్రసాదం అది.
రాములవారి విగ్రహం తల తొలగిస్తే దిక్కులేదు
గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తొలిగిస్తే దిక్కులేదు… కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటని కాదు… నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు. నాడు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదు.
పోలవరం, అమరావతి నాశనం చేసి… ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో… నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారు.
వైసీపీ నాయకులు నేరాలు చేసి….ఎదురుదాడి, బుకాయింపు, ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తప్ప… బాధ్యత అనేది లేదు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను.
గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు… రెండు కొండలు అన్నాడు
కేరళ గురువాయూర్ టెంపుల్ లో దర్శనానికి చొక్కా విప్పి వెళ్లాలి…..అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి.
గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు… అప్పుడు వ్యతిరేకించాం, పోరాడాం. అమరావతిలో రూ.250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు. వీళ్లు మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు” అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం… టీటీడీ కీలక నిర్ణయం

- ఆగమ సలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ
- లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో సలహా కోరిన అధికారులు
- మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంలో భాగంగా శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమసలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు.
శ్రీవారి లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో, ఆగమశాస్త్రాలపరంగా సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో మహాశాంతి యాగం నిర్వహించాలని ఆగమశాస్త్ర పండితులు సూచించారు. వచ్చే సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు.
విచారణ జరిపించండి… ఆ తర్వాత మాట్లాడండి: బొత్స సత్యనారాయణ

- దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్న బొత్స
- లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్
- దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్య
తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని… విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాతే మాట్లాడాలని చెప్పారు. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలని అన్నారు. లడ్డూ అంశంపై చంద్రబాబు చెపుతున్న దానికి, టీటీడీ ఈవో చెపుతున్న దానికి పొంతన లేదని చెప్పారు.
కూటమి వంద రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని… దీన్నించి ప్రజలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని చెప్పారు. విజయవాడ వరదల్లో నిజంగా ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం… తమిళనాడు ఎన్‌టీకే పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

- దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ప్రకంపనలు
- జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై చర్చ
- ఈ వ్యవహారంపై స్పందిస్తున్న అధికారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు
- లడ్డూ తప్ప దేశంలో ఇక ఏ సమస్యలు లేవా? అంటూ మండిపడ్డ ఎన్‌టీకే పార్టీ చీఫ్ సీమాన్
- కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని వ్యాఖ్య
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది.
ఇక ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అధికారులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఎన్‌టీకే పార్టీ చీఫ్ సీమాన్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా? అని ఫైర్ అయ్యారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయడం ఏంటని? మండిపడ్డారు. ఈ విషయంపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని సీమాన్ చెప్పుకొచ్చారు.