- దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రకంపనలు
- చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్
- ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి
- సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో కోర్టుకు విన్నపం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
ప్రపంచ నలుమూలలకు చెందిన కోట్లాది మంది భక్తులు కల్తీ లడ్డూ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరుడి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దీనికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కోరుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ… తిరుమల ప్రసాదం లడ్డూపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఇదిలాఉంటే.. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు.
తిరుమల లడ్డూ వివాదం.. పొన్నవోలు సుధాకర్ కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌లోని వివరాలను ప్రముఖ అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
‘‘సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశాం. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు ఏంటి? ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి. ప్రచారంలో నిజం ఉంటే బయటకు రావాలి. నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియాలంటే మీరు వేసుకున్న సిట్, లేక మీరు వేసుకున్న ఇన్వెస్టిగేషన్ కేసు సరికాదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పిన తర్వాత… ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ పరిస్థితి దాటి వేరే విధంగా విచారణ చేస్తుందా? లేదా? అనేది ముఖ్యమైన ప్రశ్న. అందుకే గౌరవ సుప్రీంకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి, వారికి సహకరించడానికి ఫుడ్ టెక్నాలజీపై నిపుణులతో కమిటీ వేసి విచారణ చేయాలని కోరుతూ ఈ రోజు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు.
నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? జరగకపోతే ఈ దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అనే కోరుతూ సుబ్బారెడ్డి పిల్ వేశారు. వాస్తవాలు శ్రీవారి భక్తులకు, బాహ్య ప్రపంచానికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిల్ దాఖలైంది. విచారణకు ఎప్పుడు వస్తుందనేది తెలియదు. విచారణకు వచ్చిన రోజు వాదనలు వినిపిస్తాం’’ అని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.
హైకోర్టులో పిల్ వేయాలని తొలుత భావించామని సుధాకర్ రెడ్డి చెప్పారు. ‘‘గౌరవ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని మొన్న అడిగాను. మీరు పిటిషన్ వేయండి… బుధవారం విచారణకు వస్తుందని ఆయన చెప్పారు. కానీ ఈ వ్యవహారం జనాలకు సంబంధించినది. రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం’’ అని తెలిపారు.
‘‘ఏఆర్ ఫుడ్ ట్యాంకర్లు సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. కల్తీ జరిగిందని గుర్తించిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపించామని అన్నారు. మళ్లీ ఆయనే మా దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదన్నారు’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబం నాశనం అయిపోవాలి… తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం
- పుష్కరిణిలో స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేసిన భూమన
- తాను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదన్న భూమన
- గత కొన్ని రోజులుగా కలత చెందుతున్నానంటూ వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడారనే వ్యవహారం ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపీడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు.
‘‘నేను గాని అపరాధం చేసి ఉంటే నాతో పాటు నా కుటుంబం కూడా సర్వ నాశనం అయిపోవాలి. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు” అని చెబుతూ… గోవిందా.. గోవిందా అని ఆయన ప్రమాణం చేశారు.
శరణాగతి తండ్రీ… గత కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతోంది… కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డూ వ్యవహారం కళంకితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని, అపచారమని పేర్కొన్నారు.
కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో భూమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు. అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామివారికి మొక్కారు.
తిరుపతికి తరలింపు!
ప్రమాణం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి పంపించారు.