పరమ నికృష్టుడివి… నీలాంటి వాళ్లకు టీడీపీలో స్థానం లేదు: అచ్చెన్నాయుడు
- విజయసాయి, అచ్చెన్న మధ్య పేలుతున్న మాటల తూటాలు
- పంచభూతాలను కూడా కబ్జా చేసే నికృష్టుడివి అన్న అచ్చెన్న
- చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్య
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కమ్మ కుల పార్టీ టీడీపీలోకి వచ్చేందుకు తాను ప్రయత్నించానా అని అచ్చెన్నపై విజయసాయి మండిపడ్డ సంగతి తెలిసిందే. అచ్చెన్న శరీరాకృతిని కించపరిచే వ్యాఖ్యలు కూడా చేశారు. విజయసాయి వ్యాఖ్యలకు అచ్చెన్న అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
విజయసాయిరెడ్డీ… నీలాగా ఆర్థిక దోపిడీ చేసే దుర్మార్గపు బుద్ధి, ఆర్థిక నేరాలకు సలహాలు ఇచ్చే దరిద్రపు బుద్ధి మాకు, మా పార్టీ వాళ్ళకు లేవు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. “పంచభూతాలను కూడా కబ్జా చేసే పరమ నికృష్ట మనిషివి… వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడే సంస్కారాన్ని బట్టి నీకు చాలా తీవ్రమైన మానసిక సమస్య ఉందని అర్థమవుతోంది… కర్మ నీ దూల తీర్చే సమయం వచ్చింది… సుదీర్ఘకాలం జైలు జీవితానికి సిద్ధంగా ఉండు” అని పేర్కొన్నారు.
భగవంతుడు తమకు ప్రజలకు సేవ చేసే బుద్ధి ఇచ్చాడని అచ్చెన్న వివరించారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని గ్రహించి వైసీపీ నుంచి టీడీపీలోకి వద్దామని నీవు విశ్వప్రయత్నాలు చేశావంటూ ఎద్దేవా చేశారు. నీలాంటి నేరగాళ్లకు, ఆర్థిక ఉన్మాదులకు టీడీపీలో స్థానం లేదని తేల్చడంతో దిక్కు తోచక పిచ్చి వాగుడు వాగుతున్నావు అని దుయ్యబట్టారు. నువ్వు, నీ నాయకుడు జగన్ ఎన్ని వేషాలు వేసినా… మీ పాపం పండింది, చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు.
నేను కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?: అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి ఫైర్
- దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదన్న విజయసాయి
- మీ చేష్టలు వింతగా ఉంటాయని ఎద్దేవా
- మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతుంటావని విమర్శ
టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… “అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు.
విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా… నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో…ఆన్… నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా” అని ట్వీట్ చేశారు.