ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాడతానన్న కాంగ్రెస్ నేత మధు యాష్కీ!
మూసీనది పక్కన ఇళ్ల తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన యాష్కీ
ప్రభుత్వంతో పోరాటం చేస్తానన్న యాష్కీ
మీ ఇళ్లపై ఒక్క గడ్డపార పడదు …ప్రశాంతంగా నిద్రపోండి అన్న యాష్కీ
అవసరమైతే పైసా ఖర్చు లేకుండా న్యాయపోరాటం చేస్తా ..
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బాధితులతో మాట్లాడుతూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తానని ఆయన అన్నారు. కోర్టులు కూడా ఉన్నాయని, ఒక న్యాయవాదిగా ప్రజల కోసం పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు.
చైతన్యపురిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ మధు యాష్కి గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ”ప్రభుత్వం కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయవాదిగా పోరాడుతాను. అదే విధంగా ప్రభుత్వంతో కూడా ప్రజల తరపున పోరాటం చేస్తాను. కూల్చివేతలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బ్లూ మార్కుకి సంబంధం లేదు” అని మూసీ బాధితులకు మధు యాష్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
”పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి. మీ ఇళ్లు ఎవరూ కూల్చరు. మీ ఇంటిపై ఒక్క గడ్డపార పడదు. మీ ఇంటి మీదికి ఒక ప్రొక్లైన్ రాదు” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అన్యాయంగా ఇళ్లు కూలగొడితే సోదరుడిగా, న్యాయవాదిగా పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు కొత్తపేట, చైతన్యపురి డివిజన్లలో బాధితులను కలిసి ఆయన మాట్లాడారు.