- రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో అబద్దాలు చెబుతున్నారన్న జోగు రామన్న
- పదవిలో ఉండి రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఫిర్యాదు
- రుణమాఫీపై పలుమార్లు మాట మార్చారన్న జోగు రామన్న
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి… రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణం తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చారని తెలిపారు.
అ తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేవుళ్లపై ఒట్టు పెట్టి ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఇప్పటి వరకు అందరికీ మాఫీ కాలేదన్నారు. తొలుత రూ.49 వేల కోట్లు అన్నారని, ఆ తర్వాత రూ.40 వేల కోట్లు అని చెప్పారని, మరోసారి రూ.31 వేల కోట్లు అని చెప్పారని, కానీ బడ్జెట్‌లో పెట్టింది మాత్రం రూ.26 వేల కోట్లు మాత్రమే అన్నారు. ఆగస్ట్ 15 నాటికి కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. మూడు దశల్లో రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు.