- వేల కోట్ల విలువైన టాటా సామ్రాజ్యం
- రేసులో మయా టాటా, నెవిల్లే టాటా, లీ టాటా పేర్లు
- ముగ్గురూ కుటుంబ వ్యాపారాల్లోనే
రతన్ టాటా మృతి నేపథ్యంలో టాటాల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు. వారిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా(34) ఒకరు కాగా, ఆమె సోదరుడు నెవిల్లే టాటా (32), వారి సోదరి లీ టాటా (39) పేర్లు వినిపిస్తున్నాయి.
నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరియర్‌ను టాటా ఆపర్చ్యూనిటీ ఫండ్‌తో ప్రారంభించి, అనంతరం టాటా డిజిటల్‌లోకి మారారు. ‘టాటా న్యూ’ యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు. ఆమె తల్లి టాటా గ్రూప్ దివంగత చైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి.
మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నాడు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. జుడియో, వెస్ట్‌సైడ్ బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి.
మయా టాటా సోదరి లీ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్‌లలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా హోటల్ పరిశ్రమపైనే ఉంది.