Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా వచ్చిన సింగపూర్ యుద్ధ విమానాలు!

  • మధురై నుంచి సింగపూర్ వెళ్లిన విమానానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్
  • అప్రమత్తమైన సింగపూర్ భద్రతా బలగాలు
  • ఎయిరిండియా విమానాన్ని జనావాసాలకు దూరంగా మళ్లించిన ఫైటర్ జెట్స్
  • విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యాక క్షుణ్ణంగా తనిఖీ

భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారం తెలిసి సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్‌ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్‌లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.

విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్‌జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్‌జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

కాగా బాంబు బెదిరింపు నేపథ్యంలో సింగపూర్ అధికారులు గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌, ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్‌ను యాక్టివేట్ చేశారు. ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

మరో విమానం కెనడాకు మళ్లింపు..
మరోవైపు ఢిల్లీ నుంచి షికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని కెనడాకు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. విమానం మంగళవారం తెల్లవారుజామున బయలుదేరిన తర్వాత బెదిరింపు వచ్చింది. దీంతో కెనడాలోని ఇకాలిట్ విమానాశ్రయానికి మళ్లించామని ఎయిరిండియా తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణికులు అందరినీ కిందికి దించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది.

Related posts

అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి

Ram Narayana

డిగ్రీ సర్టిఫికెట్ చూపించేందుకు సిగ్గెందుకు?: ఉద్ధవ్ థాకరే

Drukpadam

హర్యానాలో ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన మహిళ…

Drukpadam

Leave a Comment