- పంజాబ్ సింగర్ హత్య కేసులో అన్మోల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
- అన్మోల్‌పై 18 కేసుల నమోదు
- అమెరికా, కెనడా నుంచి నిందితులతో టచ్‌లో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్‌ని భాను అని కూడా పిలుస్తుంటారు. రెండు కేసుల్లో అతను అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అలాగే ఎన్సీపీకి చెందిన బాబా సిద్దిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనపై రివార్డును ప్రకటించింది.
అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్టుతో భారత్ నుంచి పారిపోయాడు. గత ఏడాది కెన్యాలో కనిపించాడు. ఈ ఏడాది కెనడాలో ఉన్నట్లుగా గుర్తించారు. 2022లో పంజాబ్ సింగర్ సిద్దూ మోసేవాలా హత్య కేసులో అన్మోల్ ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అన్మోల్‌పై మొత్తం 18 కేసుల నమోదయ్యాయి.
ఈ నెల ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పులకు సంబంధించి ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనకు పాల్పడింది తానే అంటూ అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే, అక్టోబర్ 12న బాబా సిద్దిఖీని ఆయన తనయుడి కార్యాలయం వద్దే షూటర్ కాల్చివేశాడని, ఆ షూటర్‌తో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని ముంబై పోలీసులు వెల్లడించారు.
బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని, అతను కెనడా, అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్ చాట్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు ఇద్దరు షూటర్లు, ఒక ఆయుధాల సరఫరాదారుడు సహా పదిమందిని అరెస్ట్ చేశారు.