- 2010 నుంచి బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ మొదలు పెట్టిన అలిస్సా
- ఇప్పటి వరకు ఏకంగా 2,600 లీటర్ల పాలను డొనేట్ చేసిందన్న మిల్క్ బ్యాంక్
- 2014లోనే గిన్నిస్ రికార్డు.. తాజాగా తన రికార్డును తానే అధిగమించిన వైనం
తల్లి పాలు అమృతంతో పోలుస్తారు.. అలాంటి అమృతాన్ని తన బిడ్డలతో పాటు ఇతరులకూ పంచుతోందా తల్లి.. ఏళ్ల తరబడి తన పాలను డొనేట్ చేస్తూ లక్షలాది మంది పసికందుల ఆకలి తీర్చింది. మొత్తంగా ఆ తల్లి 2,600 లీటర్ల పాలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కు డొనేట్ చేసింది. ఈ పాలతో దాదాపు 3.5 లక్షల మందికి పైగా పసికందుల ఆకలి తీర్చిందని మిల్క్ బ్యాంక్ పేర్కొంది. మిల్క్ బ్యాంకుకు పంపడంతో పాటు తన స్నేహితులు, తెలిసిన వాళ్లు, చుట్టుపక్కల వాళ్ల పిల్లలకూ తన పాలను ఇచ్చానని అమెరికాలోని టెక్సాస్ కు చెందిన అలిస్సా ఒగ్లెట్రీ చెబుతోంది. 2010లో కొడుకు పుట్టిన తర్వాత తనకు పాలు ఎక్కువగా పడ్డాయని, పిల్లాడు తాగిన తర్వాత పాలను పిండి మిల్క్ బ్యాంక్ కు ఇవ్వడం మొదలు పెట్టానని చెప్పారు.
ఓ నర్స్ సాయంతో తానీ డొనేషన్ కార్యక్రమం మొదలు పెట్టానని వివరించారు. తల్లి పాలు సరిపోక పోవడం, కవలలు జన్మించిన సందర్భాల్లో, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన పిల్లలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఆదుకుంటాయని చెప్పారు. ఆ బ్యాంకులకు డొనేట్ చేయడం ద్వారా అవసరంలో ఉన్న చిన్నారుల ఆకలి తీర్చవచ్చని అలిస్సా వివరించారు. ప్రస్తుతం అలిస్సా వయసు 36 సంవత్సరాలు.. 2010 నుంచి ఆమె బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తున్నారు. నాలుగేళ్లలో 1,569 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి 2014లో అలిస్సా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. టెక్సాస్ లోని బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు ఆమె డొనేషన్ ప్రస్తుతం 2,645 లీటర్లకు చేరింది. ఒక్క లీటర్ తల్లిపాలతో 11 మంది పసికందుల ఆకలి తీర్చవచ్చని మిల్క్ బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఈ లెక్కన అలిస్సా ఇప్పటి వరకు డొనేట్ చేసిన పాలతో ఏకంగా 3.50 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చామని వివరించారు.