- లెబనాన్ రాజధాని బీరుట్‌పై వైమానిక దాడికి పాల్పడిన ఇజ్రాయెల్
- వైమానిక దాడిలో మృతి చెందిన హిజ్బుల్లా మీడియా చీఫ్ మహమ్మద్ అఫిఫ్
- గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి
హిజ్బుల్లాకు చెందిన మరో కీలక నేతను ఇజ్రాయెల్ హతమార్చింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే ప్రధాన ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి.
సెంట్రల్ బీరుట్‌పై టెల్అవీవ్ సేనలు ఇటీవల కాలంలో దాడి చేయడం ఇదే ప్రధమం. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేయడం, సంస్థ అధిపతి హసన్ నస్రల్లాను హతమార్చడం వంటి పరిణామాల నేపథ్యంలో హిజ్బుల్లా మీడియా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ అఫిఫ్ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా, మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మరో వైపు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.