రైల్వేకు థ్యాంక్స్ చెప్పిన పెళ్లివారు.. నెటిజన్ల మండిపాటు
- గువాహటిలో పెళ్లి పెట్టుకున్న వరుడి కుటుంబ సభ్యులు
- కోల్‌కతా చేరుకునే గీతాంజలి ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యం
- ఆలస్యం కారణంగా హౌరా నుంచి గువాహటి వెళ్లే రైలు అందుకోలేమని ఆవేదన
- రైల్వే మంత్రి, రైల్వేశాఖకు ఎక్స్ ద్వారా విషయం చెప్పిన పెళ్లికొడుకు
- గీతాంజలి రైలు స్టేషన్‌కు చేరుకునే వరకు గువాహటి వెళ్లే రైలును ఆపాలంటూ రైల్వేశాఖ ఆదేశాలు
- పెళ్లి బృందం ఎక్కాకే కదిలిన రైలు
- 30 మంది కోసం వందలమందిని అసౌకర్యానికి గురిచేయడంపై ప్రయాణికుల ఫైర్
పెళ్లి కొడుకు కోసం బస్సులు ఆపిన సందర్భాలు చూశాం. కానీ, ఓ రైలు గంటల కొద్దీ ఆగడం మాత్రం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ అరుదైన ఘటన. ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడి వివాహం అస్సాంలోని గువాహటి అమ్మాయితో నిశ్చయమైంది. చంద్రశేఖర్ ఈ నెల 14న 34 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి 15న హౌరా చేరుకుని అక్కడి నుంచి గువాహటి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది. ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గువాహటి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.
చంద్రశేఖర్‌కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వేశాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వచ్చే వరకు హౌరాలో సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరైఘట్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వేశాఖకు, అధికారులకు చంద్రశేఖర్ థ్యాంక్స్ చెప్పాడు.
అయితే, 30 మంది కోసం వందలమందిని వేచి చూసేలా చేసిన రైల్వేపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక రైలు ఆలస్యమైందని, ఇంకో రైలును ఆన్నేసి గంటలు ఆలస్యంగా నడపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి ఎక్స్‌ప్రెస్ విషయంలో సమయపాలన పాటించడంలో విఫలమై, ఈ రకంగా క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.