- బీహార్ ఒక విఫల రాష్ట్రం అన్న ప్రశాంత్ కిశోర్
- బీహార్ ను అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- 2025లో తమ పార్టీ జన్ సురాజ్ పక్కాగా గెలుస్తుందని ధీమా
బీహార్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఒక విఫల రాష్ట్రమని అన్నారు. అమెరికాలోని బిహారీ ప్రవాసులతో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ… బీహార్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని అన్నారు. బీహార్ ను అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకవేళ బీహార్ ఒక దేశమైతే… జనాభా పరంగా ప్రపంచంలో 11వ అతిపెద్ద దేశమవుతుందని తెలిపారు. జనాభా పరంగా జపాన్ ను బిహార్ దాటేసిందని చెప్పారు.
2025లో బీహార్ లో జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే… పాఠశాల విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ… తమ పార్టీపై ఆశాజనకంగానే ఉన్నామని తెలిపారు. 2025లో జన్ సురాజ్ పక్కాగా గెలుస్తుందని చెప్పారు. 2029-30 నాటికి బీహార్ ను ఆదాయ రాష్ట్రంగా మార్చడం ఒక సవాలు అని అన్నారు. అంకితభావంతో పని చేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.