Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ కు కన్నీటి వీడ్కోలు!

బుధవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ లకారం ట్యాంక్ బండ్ పై గుండెపోటుతో మరణించిన కమ్యూనిస్ట్ యోధుడు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ పార్థివదేహాన్ని పార్టీ శ్రేణులు , అభిమానులు , బంధువులు కన్నీటి వీడ్కోలు మధ్య మమతా మెడికల్ కాలేజీకి బహుకరించారు …తొలుత సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచి సంతాప సభ నిర్వహించారు …

కడ వరకు కమ్యూనిస్టుగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చిపోటు ప్రసాద్ కు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు. కడపటి వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కమ్యూనిస్టు శ్రేణులు, వామపక్ష అభిమానులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు కదిలొచ్చారు. అమర్ హై పోటు ప్రసాద్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి హృదయం బరువెక్కింది. పోటు ప్రసాద్ తమకున్న అనుబంధాన్ని లోలోపలే గుర్తు చేసుకుంటూ కళ్లు చెమరుస్తుంటే అరుణ పతాకం చేబూని అడుగులేశారు. పోటు ప్రసాద్ అంతిమ యాత్ర శుక్రవారం ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ నుంచి ప్రారంభమైంది. పోటు ప్రసాద్ 64 సంవత్సరాల వయస్సుకు సంకేతంగా 64 అరుణపతాకాలను చేబూనిన యువ దళం ముందు నడవగా ఆ తర్వాత డప్పు దళం, పార్టీ నాయకత్వం, కుటుంబ సభ్యులు ర్యాలీగా కదిలారు. బైపాస్ రోడ్డు, ఆర్టివో కార్యాలయం, గట్టయ్య సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, ఐటి హబ్ సెంటర్, మమత రోడ్డు మీదుగా ర్యాలీ మమత మెడికల్ కళాశాలకు చేరుకుంది. దారి పొడవునా జనం ప్రసాద్ నివాళులర్పించారు. సమకాలిన రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటి ఖమ్మంజిల్లా రాజకీయాలలోనూ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ యవనిక పైన తనదైన ముద్రవేసిన పోటు ప్రసాద్ ఘనమైన వీడ్కోలు పలికారు . విద్యార్థి ఉద్యమం నుంచి ఎర్రజెండాతో పెనవేసుకున్న ఆయన బంధం, త్యాగాలకు చిరునామాగా మారిన ఆయన కుటుంబం వెరసి ప్రసాద్ ను ఉద్యమ పదంలో ఒక వేగుచుక్కలా నిలిపింది. బరువెక్కిన హృదయాలు అమర్ హై నినాదాలతో ముందుకు సాగాయి. ప్రసాద్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్దివ దేహన్ని మమత మెడికల్ కళాశాలకు అప్పగించారు. మమత వైద్య విద్యా సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ కుటుంబ సభ్యుల నుంచి అశ్రునయనాల మధ్య స్వాధీనపర్చుకున్నారు. మమత సంస్థలకు అంకురార్పణ చేసిన వారిలో పోటు ప్రసాద్ ఒకరని పోటు ప్రసాద్, పువ్వాడ ఉదయ్ కుమార్ బంధాన్ని జయశ్రీ గుర్తు చేసుకున్నారు. ఉదయ్, ప్రసాద్ అనుబంధాలకు గుర్తుగా ఉదయ్ చిత్ర పటం సాక్షిగా ప్రసాద్ పార్దివ దేహన్ని వైద్య విద్యార్థుల పరీక్షల కొరకు అప్పగించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా, పోటు ప్రసాద్కు అత్యంత ఆప్తులుగా ఉన్న దండి సురేష్, మహ్మద్ మౌలానా, బి. అయోధ్య, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె జానిమియా, గోవిందరావు, పలువురు యువ నేతలు ఆయన పార్దివ దేహాన్ని మోశారు. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. బాలమల్లేష్, ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ జిల్లాల సిపిఐ కార్యదర్శులు, కుమారుడు సాత్విక్, తల్లి సక్కుబాయి, సతీమణి నిర్మల, సోదరి, సోదరులు పాల్గొన్నారు.

త్యాగాలకు చిరునామాగా, పోరాటాలకు బాసటగా ఉద్యమ పదాన చిరస్థాయిగా నిలిచిన సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అజరామరుడని పరిపూర్ణ వ్యక్తిత్వం ,ఉత్తమ కమ్యూనిస్ట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు . ఎర్ర జెండా ఉన్నంత కాలం పోరాడే వారి ప్రతి గుండెల్లోనూ పోటు ప్రసాద్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆయన తెలిపారు. బుధవారం మరణించిన పోటు ప్రసాద్ సంతాప సభ శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ అసలైన కమ్యూనిస్టుకు పర్యాయ పదంగా పోటు ప్రసాద్ నిలిచారని కమ్యూనిస్టు ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో ప్రసాద్ అలా పనిచేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమం నిస్తేజంలో ఉన్నప్పుడు ఒక స్ఫూర్తిని రగిల్చిన అమరుడు ప్రసాద్ అన్నారు. చాలా మంది కమ్యూనిస్టుగా జీవించాలని ఆశపడేలా, తాపత్రయపడేలా ప్రసాద్ జీవితం సాగిందని కూనంనేని తెలిపారు. ఇబ్బందులకు ఎదురెళ్లడమే ఆ కుటుంబానికి తెలుసని ఒక సంపన్న కుటుంబంలో జన్మించి పేదల కోసం అష్ట కష్టాలు పడిన ఒక త్యాగమయ కుటుంబం వరిదన్నారు . నాయనమ్మ ఎర్రమ్మ, తండ్రి రాఘవయ్య వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పోరాట వారసుడిగా పోటు ప్రసాద్ విద్యార్థి, ట్రేడ్ యూనియన్ రంగాలలో పనిచేసి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. ఏ పని అప్పగించినా పట్టుదలతో, కసితో పనిచేసి విజయాన్ని సాధించేవాడని సమకాలిన రాజకీయాలలో సైద్ధాంతిక అవగాహన కలిగి సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన అతి కొద్ది మందిలో పోటు ప్రసాద్ ఒకరన్నారు. నాటి విద్యార్థి ఉద్యమం నుండి నుంచి విద్యుత్ ఉద్యమం, ఇందిరా పార్కు స్వాధీన ఉద్యమం వరకు పోరాటంలో ముందు నిలిచేవారని లాఠీ దెబ్బలైనా తిన్నాడు కాని వెనుతిరగలేదని కూనంనేని తెలిపారు. 2007లో భూ పోరాటాల సందర్భంగా ఖమ్మంజిల్లాలో ప్రసాద్ నిర్వహించిన పాత్ర చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ప్రసాద్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కాని ప్రసాద్ వేసిన పాదులు పెరిగి వికాసిస్తుండడంతో కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగేలా చేసినందుకు సంతోషం కలుగుతుందన్నారు. ప్రసాద్ ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు.

మమత సంస్థలకు అంకురార్పణ చేసిన పోటు: పువ్వాడ అజయ్

దినదిన ప్రవర్ధమానమై దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సంస్థలుగా కీర్తి గడించిన మమత సంస్థల ఏర్పాటుకు అంకురార్పణ చేసినవాడు పోటు ప్రసాద్ అని రాష్ట్ర మాజీ మంత్రి పోటు ప్రసాద్ స్నేహితుడు పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. తన సోదరుడు ఉదయ్కుమార్, పోటు ప్రసాద్లు కలిసి ప్రతిభ ప్రజ్ఞ కళాశాలలను స్థాపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రసాద్ సంస్మరణ సభలో మాట్లాడుతూ మా సోదరుడు ఉదయ్కుమార్ మాకెంతో పోటు ప్రసాద్ కూడా అంతేనని తెలిపారు. 42 సంవత్సరాలుగా ఒక జట్టుగా పనిచేశామని మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు ప్రసాద్ మరణం తట్టుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని అది ప్రసాద్ మా కుటుంబానికి ఉన్న అనుబంధమన్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమంపై అవగాహన కలిగిన పోటు ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు తామెంతో గర్వపడ్డామని సంతోషంతో ఇక కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతం తథ్యమనుకుంటున్న సమయంలో ఆయన మరణం అత్యంత బాధాకరమన్నారు. ప్రసాద్ను మననం చేసుకుంటూ అజయ్కుమార్ వేదికపైనే బోరున విలపించారు. Gపోటు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటామని, ఉద్యమానికి తమ నిరంతర సహకారం కొనసాగుతుందని అజయ్ కుమార్ తెలిపారు.

మానవతావాది ,పరిపూర్ణ కమ్యూనిస్టు ప్రసాద్ : తమ్మినేని

విద్యార్థి ఉద్యమం నుంచి నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన పోటు ప్రసాద్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఒక పరిపూర్ణ మానవుడని ,మానవతావాది అని అన్నింటికి మించి సంపూర్ణ కమ్యూనిస్టు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులు అర్పించారు . కష్ట కాలంలో కమ్యూనిస్టుకు దన్నుగా నిలిచి ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తులలో పోటు ప్రసాద్ ఒకరన్నారు. పోటు ప్రసాద్ సంతాప సభలో తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టులు బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుందన్నారు. ఒక పక్క బలహీనపడుతూ మరో పక్క అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రసాద్ లాంటి వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. కమ్యూనిస్టుల ఎజెండా లేని దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుందని ఆయన తెలిపారు. సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన గొప్ప మానవతా వాది పోటు ప్రసాద్ అని ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటన్నారు. ప్రసాద్ అనుబంధం మరువలేనిది పాయం

పోటు ప్రసాద్ తో తన అనుబంధం మరువలేనిదని ఉద్యమ స్రవంతిలోకి తనను తీసుకు రావడంలో ఆయన అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారని పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సంతాప సభలో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పోటు ప్రసాద్ తన అనుబంధం కొనసాగుతుందని నిజాయితీకి నిలువుటద్దమన్నారు. కార్యశీలత, ప్రణాళిక తదితర విషయాలు ప్రతి ఒక్కరూ పోటు ప్రసాద్ నుంచి నేర్చుకోవాలని పాయం సూచించారు. ఆయన మరణం సమకాలిన రాజకీయాలకు తీరని లోటని పాయం నివాళులర్పించారు.

నిబద్దత గల కమ్యూనిస్టు : మువ్వా

పోటు ప్రసాద్ అత్యంత నిబద్దత కలిగిన కమ్యూనిస్టు అని కడ వరకు సత్యశీలతతో జీవించారని నీటి పారుదల, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు తెలిపారు. పోటు ప్రసాద్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ నిజాయితీపరుడిగా, కార్యదర్శుడిగా పోటు ప్రసాద్ పేరొందారని విజయ్బాబు తెలిపారు. ఆయన మరణం ఖమ్మంజిల్లా రాజకీయాలకు ప్రత్యేకించి పేదల పోరాటాలకు తీరని లోటన్నారు.

ఈ సంతాప సభలో సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎన్. బాలమల్లేష్, కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు పాకాలపాటి వెంకటేశ్వరరావు, మహ్మద్ మౌలానా, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, టిడిపి జిల్లా కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎంఎల్ పార్టీ నాయకులు విజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కార్యదర్శి ఎస్కో సాబీర్పౌషా, కాంగ్రెస్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, పలు జిల్లాల కార్యదర్శులు, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, ప్రసాద్ తనయుడు సాత్విక్, సోదరి పోటు కళావతి,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కి జానిమియా, సిద్దినేని కర్ణకుమార్, ఏఐఎస్ఎఫ్. ఏఐవైఎఫ్ బాధ్యులు రామకృష్ణ, పుట్టా లక్ష్మణ్, ఆరికె తదితరులు ప్రసంగించారు.

Related posts

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి…

Ram Narayana

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Drukpadam

Leave a Comment