- ఆర్‌కే పురంలోని డీపీఎస్, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూళ్లకు బాంబు బెదిరింపు
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్
- పాఠశాలల్లో డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసుల సోదాలు
ఢిల్లీలోని 40కి పైగా పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. ఆర్‌కే పురంలోని డీపీఎస్, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూళ్లకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు సమాచారం. దాంతో ఆ పాఠశాలల సిబ్బంది విద్యార్థులను ఇంటికి పంపించి పోలీసులకు సమాచారం అందించారు.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11.38 గంటల సమయంలో స్కూళ్లకు ఈ ఈమెయిల్ వచ్చింది. బాంబు చాలా చిన్నవని, వాటిని రహస్య ప్రదేశాల్లో పెట్టినట్టు ఆగంతకులు పేర్కొన్నారు. బాంబులు పేలకుండా నిర్వీర్యం చేయాలంటే 30వేల డాలర్లు డిమాండ్ చేసినట్లు ఆ ఈమెయిల్‌లో ఉందట.
ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఉదయం 6:15 గంటలకు జీడీ గోయెంకా స్కూల్ నుంచి మొదటి కాల్ వెళ్లింది. ఆ తర్వాత 7:06 గంటలకు డీపీఎస్ స్కూల్ నుంచి మరొక కాల్ వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. దాంతో అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలాఉంటే.. అక్టోబర్‌లో రోహిణి ప్రశాంత్ విహార్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పాఠశాల వెలుపల పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు సమీపంలోని దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు కూడా ఉదయం 11 గంటలకు అన్ని సీఆర్‌పీఎఫ్ పాఠశాలల్లో బాంబు పేలుడు జరుగుతుందని ఆయా పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దాంతో వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ బెదిరింపు బూటకమని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.