- రేపటితో ముగియనున్న శక్తికాంత దాస్ పదవీకాలం
- ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రా
- మల్హోత్రా నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం
- ఆర్బీఐ 26వ గవర్నర్ గా మూడేళ్ల పాటు కొనసాగనున్న మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శక్తికాంత దాస్ స్థానాన్ని సంజయ్ మల్హోత్రా భర్తీ చేయనున్నారు.
శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ గా 2018 డిసెంబరు 12న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తయినప్పటికీ, మరికొన్నాళ్ల పాటు పదవీకాలం పొడిగించారు. పొడిగించిన పదవీకాలం రేపు డిసెంబరు 10తో ముగియనుంది.
శక్తికాంత దాస్ స్థానంలో ఆర్బీఐ పగ్గాలు అందుకోబోతున్న సంజయ్ మల్హోత్రా పదవీకాలం బుధవారం ప్రారంభం కానుంది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్నారు.
సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.
సివిల్స్ రాసి ఐఏఎస్ అయిన సంజయ్ మల్హోత్రా… తన 33 ఏళ్ల కెరీర్ లో విద్యుత్, ఆర్థిక, పన్నులు, సమాచార సాంకేతికత, గనుల శాఖలో విధులు నిర్వరించారు.