- తాను బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేసిన సంజయ్
- జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని వెల్లడి
- పార్టీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దీనిపై బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
పార్టీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీజేపీలో సమష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు.