- నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం
- ఇప్పటికే విజయవాడ చేరుకున్న కార్పొరేటర్లు
- కడప ఎంపీ అవినాష్‌రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాంరాం చెప్పేయగా, మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు నేతలు ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నుంచి వలసలు కొనసాగుతాయని వార్తలు వస్తున్న వేళ, వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.
కడప కార్పొరేషన్‌కు చెందిన 8 మంది కార్పొరేటర్లు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వీరందరూ ఇప్పటికే విజయవాడ కూడా చేరుకున్నారు. పార్టీ మారుతున్న వారిలో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు వరుసకు సోదరుడు అవుతారు. అలాగే, మహిళా కార్పొరేటర్ ఒకరు ఉన్నారు. మేయర్ సురేశ్‌బాబుకు కంచుకోట లాంటి చిన్నచౌకులో మెజార్టీ కార్పొరేటర్లు పార్టీ మారుతుండటంతో వైసీపీలో కలవరం మొదలైంది. వీరిని నిలువరించేందుకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది.