- గతంలో అనుమతులిచ్చి ఆ తర్వాత రద్దు చేస్తే అక్రమమే అవుతాయని వెల్లడి
- హైడ్రా రాకముందు అనుమతులిచ్చిన కట్టడాలను కూల్చబోమన్న రంగనాథ్
- ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వ్యాపార కట్టడాలను కూల్చక తప్పదని స్పష్టీకరణ
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చి తర్వాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమమే అవుతాయని, కాబట్టి అనుమతులు రద్దైన నిర్మాణాలు ఉంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైడ్రా రాకముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ కూల్చబోమన్నారు.
అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జులై 2024కు సిద్ధమై, వాటిలో నివాసముంటే హైడ్రా కూల్చివేయబోదన్నారు. ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. కొంతమంది పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.
మల్లంపేట కొత్వాల్ చెరువు, అమీన్‌పూర్‌లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలేనని వివరించారు. ఎఫ్‌టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామని, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళుతోందన్నారు.
లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగుతుందన్నారు. వివిధ సందర్భాలలో కోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకు వెళుతోందన్నారు. ప్రభుత్వం దిశానిర్దేశనం మేరకు హైడ్రా పని చేస్తోందన్నారు. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టిందని తెలిపారు. గత 5 నెలల్లో హైడ్రా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు.