‘ఆపరేషన్ స్మైల్’-XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ

రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,అక్రమ రవాణా కు గురైన చిన్నారులను రక్షించి,వారికి పునరావాసం కల్పించేందుకు చేపడుతున్న ‘ఆపరేషన్ స్మైల్’-XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి అన్నారు.
2025 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే పదకొండవ ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా
జిల్లాల పోలీసు, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, కార్మిక, విద్య మరియు ఆరోగ్య శాఖలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, NGO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ నుండి అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ మాట్లాడుతూ… బాలకార్మికులు, చిన్నారుల దుర్భర స్థితిలో ఉండే ప్రాంతాలను తెలుసుకొని వాటిని బ్లాక్ స్పాట్లుగా గుర్తించి చిన్నారులను విముక్తి కలిగించాలన్నారు. ప్రధానంగా రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్ళు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆపరేషన్ స్మైల్లో చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖ కవళికలను గుర్తించే దర్పణ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలనిచ్చిందని అన్నారు. అనేక మంది తప్పిపోయిన పిల్లలను దర్పణ్ అప్లికేషన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారని అన్నారు. ఇతర రాష్ట్రాల చిన్నారుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు అప్పగించారని అన్నారు.
పిల్లలను అక్రమంగా తరలించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో చిన్నారులను రక్షించేందుకు ఒక్కొక్క డివిజన్ లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఏఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లు (మహిళా అధికారితో సహా)తో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు. మైనర్లను ఇంటి పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని అన్నారు.